ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSR BHEEMA: నెలలోపే బీమా సొమ్ము చెల్లింపు - సీఎం జగన్​ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన వైఎస్సార్‌ బీమా పథకం అమలులో పాలసీదారు కుటుంబానికి క్లెయిమ్​ సొమ్మును నెలలోపు అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను అనుసంధానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

YSR BHEEMA
నెలలోపే బీమా సొమ్ము చెల్లింపు

By

Published : Jul 2, 2021, 5:53 AM IST

పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉచిత బీమా రక్షణగా ‘వైఎస్సార్‌ బీమా పథకం’(YSR BHEEMA) అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి(CM JAGAN) వెల్లడించారు. ఈ పథకం కింద 2021-22లో రాష్ట్రంలోని 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్లతో బీమా రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. ఇకపై ఎలాంటి ఘటన జరిగిన నెలలోనే క్లెయిమ్‌ పరిష్కారం (సెటిల్‌) అయ్యేలా గ్రామ సచివాలయాలకు, వాటిని పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. కేంద్రం బీమా పథకం నుంచి వైదొలిగినా దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేరుస్తోందని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గురువారం మీట నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేదలపై ఒక్క రూపాయి భారం పడకుండా 18-50 ఏళ్ల మధ్య గల సంపాదించే కుటుంబ పెద్ద సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తాం. 18-70 ఏళ్ల మధ్య గల సంపాదించే కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా పథకాన్ని రూపొందించాం. ఎలాంటిఘటనలు జరిగినా నెలలోనే పరిష్కారం అవుతాయి’ అని వివరించారు.

క్లెయిమ్‌ల పరిష్కారంలో విపరీత జాప్యం..

2020 ఏప్రిల్‌లో కేంద్రం ఈ పథకం నుంచి వైదొలిగింది. అప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొనసాగింది. కేంద్రం వైదొలగడమే కాక అర్హులకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా బీమా చేయించాలని ఆదేశించింది. దీంతో 1.21 కోట్ల కుటుంబాలకు ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అయినా బ్యాంకులు లబ్ధిదారులందరికీ వ్యక్తిగత ఖాతాలు తెరిచి వాటి ద్వారా కంపెనీలకు డబ్బులు కట్టి పూర్తి స్థాయిలో నమోదు చేయించలేకపోయాయి. కేవలం 62.5 లక్షల మంది లబ్ధిదారులే నమోదయ్యారు. మిగిలిన 58.5 లక్షల మందిని నమోదు చేయలేకపోయాయి. నమోదులోనూ, బ్యాంకులు బీమా కంపెనీలతో మాట్లాడి క్లెయిమ్‌లను పరిష్కరించడంలోనూ విపరీతమైన జాప్యం చోటుచేసుకుంది.

బీమా నమోదు, ఫిర్యాదుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు..

పథకం అమలులో ఏదైనా సమస్య ఉంటే 155214 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయొచ్చు. బీమా నమోదు, ఫిర్యాదు, ఎలాంటి సందేహం ఉన్నా ఈ నంబరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో ప్రతి వాలంటీరునూ భాగస్వామిని చేయాలి. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి పెద్ద, సంపాదించే వ్యక్తి పేరుతో బీమా పాలసీ చేయించేలా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి.

ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా..

‘కేంద్రం, బ్యాంకులు, ఎల్‌ఐసీ సంస్థ చేతులెత్తేసినా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ వైఎస్సార్‌ బీమాను అమల్లోకి తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారు.’

- గుమ్మనూరు జయరామ్‌, కార్మికశాఖ మంత్రి

ఇదీ చదవండి:

YSR Bheema Scheme: పేదలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటాం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details