కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా భారీ విజయం (Badvel Bypoll Result news) సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ(ycp candidate sudha news) విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మేరకు వైకాపా అభ్యర్థి సుధకు ఆర్వో ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందించారు.13 రౌండ్లు ముగిసేసరికి ఆమె.. 90,411 ఓట్ల మెజార్టీని సాధించారు. మరోవైపు ఫ్యాన్ పార్టీ జోరు ముందుకు ఇతర పార్టీలేవీ నిలబడలేకపోయాయి. ఇప్పటికే పోలైన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కవగా వైకాపాకు రావడంతో ఉప పోరులో వైకాపా గెలిచినట్లైంది. కాగా వైకాపా విజయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు 13వ రౌండ్‌లో వైకాపాకు 362,, భాజపాకు 40 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 12, నోటాకు 14 ఓట్లు వచ్చాయి.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 13 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 1,12,072, భాజపాకు 21,661 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 6,217 ఓట్లు దక్కగా.. నోటాకు 3,636 ఓట్లు వచ్చాయి.
ఓట్ల శాతం ఇలా...
బద్వేలు ఉపఎన్నికలో వైకాపాకు 76.24 శాతం ఓట్లు దక్కాయి. భాజపాకు 14.73 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 4.22 శాతం ఓట్లు వచ్చాయి. ఈ బైపోల్లో నోటాకు 2.48 శాతం ఓట్లు పోలయ్యాయి.
ప్రజలకు ధన్యవాదాలు: వైకాపా అభ్యర్థి సుధ
తన విజయం తరువాత మీడియాతో మాట్లాడిన వైకాపా అభ్యర్థి సుధ.. నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు.. విజయానికి సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికే తన మెుదటి ప్రాధాన్యమని అన్నారు.
వైకాపా నేతల హర్షం
ఉప ఎన్నిక ఫలితం అనంతరం మాట్లాడిన వైకాపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో లక్షకు పైగా మెజారిటీ వస్తుందని అనుకున్నామని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. పోలింగ్ శాతం ఇంకా పెరిగి ఉంటే మెజారిటీ పెరిగేదని అభిప్రాయపడ్డారు. బద్వేలు నియోజకవర్గ ప్రజలంతా సీఎంను ఆశీర్వదించారని చెప్పారు. జగన్ నాయకత్వాన్ని బలపరిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెదేపా, భాజపా, జనసేన అంతా కలిసినా డిపాజిట్ దక్కలేదన్నారు.
నైతిక విజయం మాదే: భాజపా అభ్యర్థి సురేశ్
ఉప ఎన్నిక ఫలితాలపై భాజపా అభ్యర్థి పనతల సురేశ్ స్పందించారు. నైతికంగా తామే విజయం సాధించామన్నారు. వైకాపా ప్రభుత్వ పతనం బద్వేలు నుంచే ప్రారంభమైందన్నారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ భాజపా అని నిరూపించామని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు: కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ
బద్వేలులో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఆరోపించారు. ప్రజలనాడి తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ ఎన్నికలను అధికారపార్టీ స్వచ్ఛందంగా నిర్వహించలేదన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక..
సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ మంది అభ్యర్థులు తుది పోటీలో ఉంటారని చాలామంది భావించారు. అయితే.. గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు- ఆధిక్యం వీరిదే!