ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తవేసి... ఆస్తిపన్నుపై చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం' - రాష్ట్రంలో చెత్త ఆస్తి పన్నులు

కొత్తగా విధించిన చెత్త పన్ను, పెరిగిన ఆస్తి పన్ను వసూళ్ల కోసం పుర, నగరపాలక సంస్థలు కొద్దిరోజులుగా ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చెత్త పన్ను చెల్లించని దుకాణాల ముందు చెత్త వేసి, ఆస్తిపన్నుపై స్పందించని ప్రజల ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వచ్చే 13 రోజుల్లో ప్రజల నుంచి రూ.1,033.94 కోట్లు వసూలుచేసి లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు అన్ని ఉపాయాలూ ప్రదర్శిస్తున్నారు.

చెత్త వాహనం
చెత్త వాహనం

By

Published : Mar 19, 2022, 5:37 AM IST

Updated : Mar 19, 2022, 6:03 AM IST

కొత్తగా విధించిన చెత్త పన్ను, పెరిగిన ఆస్తి పన్నుపై ప్రజల్లో, ప్రజాసంఘాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరించిన పుర, నగరపాలక సంస్థలు కొద్దిరోజులుగా వీటి వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చెత్త పన్ను చెల్లించని దుకాణాల ముందు చెత్త వేసి, ఆస్తిపన్నుపై స్పందించని ప్రజల ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. దీంతో వచ్చే 13 రోజుల్లో ప్రజల నుంచి రూ.1,033.94 కోట్లు వసూలుచేసి లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు అన్ని ఉపాయాలూ ప్రదర్శిస్తున్నారు. సచివాలయాల ఉద్యోగులు, వార్డు వాలంటీర్ల సేవలనూ వినియోగిస్తున్నారు.

చెత్త పన్నును వ్యతిరేకిస్తున్నా...

ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి సేకరించే చెత్తపై పన్ను వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇళ్ల నుంచి నెలకు రూ.80-120, మురికివాడల్లో రూ.60, వ్యాపారసంస్థలు, హోటళ్ల నుంచి స్థాయిని బట్టి కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.15వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం నాలుగు నెలల క్రితమే అధికారులు రంగంలోకి దిగారు. నగర, పట్టణ ప్రజల్లో చాలామంది ఇప్పటికీ చెత్తపై పన్నులు చెల్లించలేదు. దీంతో వాలంటీర్లు ఈ పన్ను బకాయిలపై తమ పరిధిలోని ఇళ్ల యజమానులకు వాట్సప్‌ గ్రూపుల్లో సందేశాలు పెడుతున్నారు. మార్చి నెలాఖరులోగా చెల్లించకపోతే ఇళ్ల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తీసుకెళ్లరని స్వయంగా చెబుతున్నారు. చెత్తపై పన్ను చెల్లించకపోతే వ్యాపార అనుమతులు రద్దుచేస్తామని విజయవాడ, విశాఖలో దుకాణదారులను ప్రజారోగ్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. కర్నూలులో ఒక దుకాణం ముందు చెత్త వేసి బెదిరించారు.

చెత్తపై పన్నుల వసూళ్ల సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. నవంబరు నుంచి ఇప్పటివరకూ ఎన్ని కుటుంబాలు పన్నులు చెల్లించాయి, ఇంకా ఎందరు చెల్లించాల్సి ఉందన్న సమాచారం కూడా బయటపెట్టడం లేదు. అధికారులు ఈ విషయమై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, గుంటూరు, కాకినాడ నగరపాలక సంస్థల్లో పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలో గల పలు పురపాలక సంఘాల్లోనూ ప్రజలు చెత్తపై పన్నును వ్యతిరేకిస్తున్నారు.

ఆస్తిపన్ను వసూళ్లకు జప్తు ప్రయోగం

మూలధన విలువ ఆధారంగా పెరిగిన ఆస్తిపన్ను వసూళ్ల కోసం ‘జప్తు’ అస్త్రం ప్రయోగిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా పన్ను చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని వాలంటీర్లు, పురపాలక సిబ్బందితో ప్రజలను భయపెడుతున్నారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని పురపాలక సంఘాల్లో సిబ్బంది పన్నులు చెల్లించని ఇళ్లకు వెళ్లి పన్నులు చెల్లిస్తారా? ఇళ్లలో వస్తువులు తీసుకెళ్లాలా? అని హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. పెరిగిన పన్నులు చెల్లిస్తే కొత్త విధానాన్ని ప్రజలు ఆమోదించినట్లు అధికారులు నివేదిక రూపొందించనున్నారు.

ఇదీ చదవండి :police రాష్ట్రంలో ఇష్టానుసారంగా పోలీసుల భౌతిక దాడులు..అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే...

Last Updated : Mar 19, 2022, 6:03 AM IST

ABOUT THE AUTHOR

...view details