చాలామంది బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో కడుక్కున్నాంలే అన్నట్లుగా గబగబా చేతులు కడిగేసుకుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఏటా మే 5న ‘హ్యాండ్ హైజీన్ డే’ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో డబ్య్లూహెచ్ ఈ ఏడాది ‘Seconds save lives – clean your hands!’ అనే థీమ్‌తో మన ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. ఇటు వైరస్ బాధితుల్ని సంరక్షించుకుంటూనే, అటు ఇన్ఫెక్షన్ విస్తరించకుండా కాపాడాలంటూ పిలుపునిచ్చింది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని నొక్కివక్కాణించింది. అయితే ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అపరిశుభ్రమైన చేతుల కారణంగా ఆరోగ్యానికి బోలెడన్ని అనార్థాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నాయి. అవేంటంటే..!
ఏటా పది లక్షల మంది !
కరోనా కారణంగా ప్రస్తుతం అందరూ గంటకోసారి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మరి కరోనాకు ముందు కూడా ఇలాగే చేతులు కడుక్కునేవారా? అంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. ఓ అధ్యయనం ప్రకారం.. సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏటా పదిలక్షల మంది వివిధ అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారట.
చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో కుటుంబ సభ్యులు, స్నేహితులను తాకినా వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. చూశారుగా ఒకరి నిర్లక్ష్యం ఎంతమంది అనారోగ్యానికి కారణమవుతుందో! ఇక మొబైల్, టీవీ రిమోట్, ఇంట్లోని డైనింగ్ టేబుల్, తలుపులు, కిటికీలపై కూడా వ్యాధికారక క్రిములుంటాయి. ఒక టాయిలెడ్ కమోడ్‌పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఒక్క కరోనానే కాదు.. డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ!
చిన్నారులు, ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోతే వారికి అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.