రాష్ట్రంలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు కోసం రెండేళ్ల కాలపరిమితితో అంటే..2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకూ.. నూతన విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడున్న వాటిలో 40శాతం బార్లు కనుమరుగు కానున్నాయి. మిగతా వాటికి మాత్రమే కొత్తగా లైసెన్సులు కేటాయించనుంది. ఈ మేరకు నూతన బార్ల విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బార్లలో విక్రయించే మద్యం ధరలనూ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
నేటి నుంచి కొత్త బార్ల విధానం
ఏపీలో దశల వారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది.
wine new policy in ap
రిజిస్ట్రేషన్, లైసెన్సు రుసుములు భారీగా బాదుడు
- రిజిస్ట్రేషన్ రుసుమును కనిష్ఠ శ్లాబులో రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలకు, గరిష్ఠ శ్లాబులో రూ.28 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచారు.
- లైసెన్సు రుసుము అంతకు ముందు అన్ని శ్లాబులకు రూ.2 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.5 లక్షలకు పెరిగింది.
- త్రీస్టార్, అంతకంటే పై స్థాయి హోటళ్లు, మైక్రో బ్రూవరీస్‌లోని బార్లకు రిజిస్ట్రేషన్, లైసెన్సు రుసుము కలిపి ఏడాదికి రూ.1.50 కోట్లుగా నిర్ణయించారు.
- దరఖాస్తు రుసుము గతంలో రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు అది రూ.10 లక్షలకు పెరిగింది.