Wife Suicide by husband harassments: ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలి అందం గురించి పట్టించుకోని యువకుడు.. భార్యగా మారాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చీటికిమాటికీ అందంగా లేవంటూ వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ముదిరి దాడులకు తెగబడ్డాడు. రోజూ భర్త పెట్టే వేధింపులు తాళలేక.. ఆమె ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఎవరూ లేని సమయంలో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో ఈ ఘటన జరిగింది.
పెద్దలకు చెప్పుకున్నా..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్‌గుర్తికి చెందిన మహేష్, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23) ఇద్దరూ.. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వారి జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందంగా లేవని, భార్యను శారీరకంగా, మానసికంగా నిత్యం వేధించడమే కాకుండా, చేయి చేసుకోవడం ప్రారంభించాడు. తన ఆవేదనను పలుమార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో చెప్పుకొని ఆమె విలపించేది. ఇటీవల భర్త వేధింపులు అధికమయ్యాయి. తన సమస్యను ఎవరూ పరిష్కరించలేరు అని.. ఇక తనకు చావే శరణమని భావించి బలవన్మరణానికి పాల్పడింది.