"మేఘా"కు మేలు చేసేందుకే ఆర్టీసీ ఎండీ బదిలీ: అశోక్‌బాబు
ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ వెనుక మర్మమేంటో ప్రజలకు వైకాపా నేతలు చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లను దక్కించుకున్న మేఘా సంస్థకే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొత్త టెండర్లను కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అసలు పాలనే లేకుంటే ముఖ్యమంత్రి నీతివంతమైన పాలన ఎలా అందిస్తారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబుని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొత్త టెండర్లకు అడ్డు వస్తారనే సురేంద్ర బాబుని బదిలీ చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో వైకాపా నేతలు ఉన్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే పేరును కరకట్ట ఎమ్మెల్యే అని మార్చుకోవాలని అశోక్‌బాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసంపైనే ఆర్కే దృష్టి అంతా ఉంటుందని పేర్కొన్నారు. అది అవినీతి కట్టడం అయితే నిరూపించాలని సవాల్ విసిరారు.