పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా కోస్తాంధ్ర తీరం వైపుకు దూసుకువస్తోంది. గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది రేపు ఉదయానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని విశాఖ, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.