దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. మే7 వరకూ అల్పపీడనం వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది.
రెండురోజుల్లో వర్షాలు
వచ్చే రెండు రోజులు అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ప్రకటించింది.