Rains in AP: అకాల వర్షంతో తీవ్ర నష్టం.. నేడు, రేపు వానలు కురిసే అవకాశం - fruits craps damage in ap
Rains Damage in AP: నిన్నటి వరకు ఎండ, వడగాలులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలను బుధవారం అకాల వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రంలో వాతావరణం మారింది. బుధవారం ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతలతో కొన్ని ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈదురుగాలులు హోరెత్తించాయి. అక్కడక్కడా తీగలు తెగి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడు, రేపు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.
Rains in AP
By
Published : May 5, 2022, 5:28 AM IST
బుధవారం ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు దద్దరిల్లాయి. బాపట్ల, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పిడుగుపాటుతో నలుగురు, ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో 6 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ ఒక మోస్తరు వానలు కురిశాయి.
తెగిన విద్యుత్తు తీగలు...:బుధవారం ఉదయం పలుచోట్ల గంటపాటు వర్షం బీభత్సం సృష్టించింది. విశాఖపట్నంలో వర్షం కురవడంతో పదోతరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గంలో ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపోయాయి. పిడుగుపాటుకు పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాలెంలో పుట్ల అమరయ్య (15), దుర్గి మండలం గజాపురంలో వంకనావత్ వాగ్యనాయక్ (35), బాపట్ల జిల్లా తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో కత్తి సుబ్రహ్మణ్యం (57), తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడులో గంధం శంకర్ (15) మృతి చెందారు. పల్నాడు జిల్లా వినుకొండలో వర్షానికి పెంకుటిల్లు కుప్పకూలి పంచుమర్తి లక్ష్మీకుమారి (56) దుర్మరణం చెందారు. పిడుగుపడి దాచేపల్లి మండలం నడికూడిలో, ఈపూరు మండలం ముప్పాళ్లలో ఒక్కో ఇల్లు దెబ్బతిన్నాయి.
నేలకొరిగిన అరటి, బొప్పాయి..:రబీ వరి ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. చాలా ప్రాంతాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబెట్టారు. ఈ సమయంలో వర్షం రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పల్నాడు జిల్లాలో కళ్లాల్లో ఉన్న చివరి కోత మిరప తడిసింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో కోతకొచ్చిన మామిడి నేలరాలింది. అరటి చెట్లు పడిపోయాయి. చిత్తూరు జిల్లా కుప్పం, తిరుపతి జిల్లా వడమాలపేటలో మామిడికి నష్టం తలెత్తింది. పల్నాడు జిల్లాలో 63.10 హెక్టార్లల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. పిడుగురాళ్ల, బొల్లాపల్లి, మాచవరం తదితర మండలాల్లో బొప్పాయి చెట్లు విరిగాయి. ప్రకాశం జిల్లా అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు మండలాల్లో సెనగ తడిసింది.
Today Weather Report:దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, విదర్భ నుంచి రాయలసీమ మీదుగా అంతర్గత తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం నెలకొంది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ.. తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రంపేర్కొంది.