ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాటల యుద్ధం.. సభ్యుల బాహాబాహీ.. వెరసి మండలి వాయిదా..!

రాష్ట్ర శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మంటలు రేగాయి. మాటల తూటాలు, వాగ్బాణాలు దాటి బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార, విపక్షాల మధ్య ఘర్షణతో... యుద్ధవాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే సభ నిరవధికంగా వాయిదా పడింది.

మాటల యుద్ధం.. సభ్యుల బాహాబాహీ.. వెరసి మండలి వాయిదా..!
మాటల యుద్ధం.. సభ్యుల బాహాబాహీ.. వెరసి మండలి వాయిదా..!

By

Published : Jun 18, 2020, 3:30 AM IST

Updated : Jun 18, 2020, 10:31 PM IST

మంత్రులు, అధికార వైకాపా సభ్యులు ఓవైపు.. విపక్ష తెదేపా ఎమ్మెల్సీలు మరోవైపు మోహరించిన వేళ రాష్ట్ర శాసనమండలిలో బుధవారం యుద్ధ వాతావారణం నెలకొంది. మాటలు, వాగ్వాదాలు దాటి బాహాబాహీకి దిగే పరిస్థితి తలెత్తింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన అంశాలపై రూల్​ 90 కింద ఇచ్చిన తీర్మానంపై ఓటింగ్​ నిర్వహించాలని ప్రతిపక్ష తెదేపా కోరింది. నిబంధనల ప్రకారం లేని నోటీసును ఛైర్మన్​ ఎలా పరిగణలోకి తీసుకుంటారని వైకాపా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీలు పదే పదే వెల్​లోకి దూసుకెళ్లడం వల్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, తెదేపా సభ్యుడు బీద రవిచంద్రయాదవ్​ మధ్య మాటల యుద్ధం సాగింది.

మంత్రిని బీద రవిచంద్ర కాలితో తన్నారని వైకాపా సభ్యులు, మంత్రులు ఆరోపించారు. ఎమ్మెల్సీ నారా లోకేశ్​ వైపు దూసుకొస్తుంటే నిలువరించామని తెదేపా సభ్యులు పేర్కొంటున్నారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు.

రూల్​ 90 నోటీసుపై ఓటింగ్​కు తెదేపా పట్టు

రూల్​ 90 కింద తామిచ్చిన నోటీసుపై ఓటింగ్​ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ తెదేపా సభ్యులు వెల్​లోకి వెళ్లి నినాదాలు చేశారు. మంత్రులు, వైకాపా సభ్యులు కూడా వెల్​లోకి చొచ్చుకొచ్చారు. సభ ఆర్డరులో లేదని, సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని డిప్యూటీ ఛైర్మన్​ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు. సభ ఆర్డరులో లేకపోతే ఓటింగ్​ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ క్రమంలో అప్పటికే వెల్​లో ఉన్న మంత్రి వెల్లంపల్లి, తెదేపా సభ్యుడు బుద్దా నాగజగదీశ్వరరావుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మిగతా సభ్యులు వారించారు.

లోకేశ్​పై ఫిర్యాదు

సభలో ఉద్రిక్తతను నారా లోకేశ్​ సెల్​ఫోన్​లో చిత్రీకరిస్తున్నారంటూ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్​.. డిప్యూటీ ఛైర్మన్​ రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఫిర్యాదు చేశారు. చిత్రాలు తీయొద్దని డిప్యూటీ ఛైర్మన్​ ఆదేశించారు. ఆయన మాట్లాడుతుండగానే.. మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి లోకేశ్​ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తెదేపా సభ్యులు బీద రవిచంద్రయాదవ్​, మంతెన సత్యనారాయణరాజు అటువైపు నుంచి ముందుకొచ్చారు. ఉద్రిక్తత నెలకొనడం వల్ల రాత్రి 7.57 గంటలకు సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి మండలి డిప్యూటీ ఛైర్మన్​ సభాధ్యక్ష స్థానం నుంచి వెళ్లిపోయారు.

సభలో ఉద్రిక్తత

అనంతరం మంత్రి వెల్లంపల్లి, లోకేశ్​ వైపు వెళ్తుండగా బీద రవిచంద్ర నిలువరించారు. మంత్రి వెల్లంపల్లి, బీద రవిచంద్ర బాహాబాహీకి దిగబోగా తెదేపా సభ్యులు, మంత్రులు వారించారు. నిరవధికంగా సభ వాయిదా పడిన తర్వాత కూడా సభ లోపలే దాదాపు పది నిమిషాల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. అంతకు ముందు వెల్​లోకి మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​, తెదేపా సభ్యుడు రాజేంద్రప్రసాద్​ మధ్య కూడా ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించగా మంత్రులు, తెదేపా సభ్యులు నిలువరించారు. ఆ ఉద్రిక్తత సద్దుమణిగిన కొద్దిసేపటికే మళ్లీ ఇతర సభ్యుల మధ్య వివాదం నెలకొని నిరవధిక వాయిదాకు దారి తీసింది.

ఇదీ చూడండి..

'ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరించారు'

Last Updated : Jun 18, 2020, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details