విజయవాడలో హవాలా ముఠా గుట్టు రట్టయింది. గొల్లపూడి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కారును పరిశీలించగా...34 వేల అమెరికన్ డాలర్లు, రూ.1.47 కోట్ల హవాలా మనీ తరలిస్తున్నట్లు గుర్తించినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. నరసాపురం నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లుగా తేలిందని వివరించారు.
ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి ఈ దందాను అపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంటర్ స్టేట్ హవాలా రాకెట్‌గా గుర్తించామన్న సీపీ... నరసాపురం ప్రాంతంలో గల్ఫ్ నుంచి వచ్చేవారి వద్ద తక్కువ ధరకు డాలర్లు కొంటున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు వాటిని అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై ఆదాయపు పన్ను అధికారుల విచారణతో పాటు... డాలర్ల హవాలపై ఈడీ కూడా విచారణ చేపట్టిందన్నారు. ఈ హవాలా రాకెట్‌పై భవానీపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.