Variety of Vinayaka Idols : కొవిడ్ కారణంగా రెండేళ్లు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో 7 వేల పైనాపిల్స్‌తో ఏకదంతుని ప్రతిమను కొలువుదీర్చారు. దీనికి అదనంగా మండపానికి ఇరువైపులా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లు ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కడప ఊరగాయలవీధిలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో రూపొందించిన 12 అడుగుల గణేశ్ విగ్రహం ఆకర్షిస్తోంది.
నెల్లూరులో కొబ్బరి గణనాథుడు: నెల్లూరు కనకమహాల్ సెంటర్‌లో ఎండు కొబ్బరితో గణనాథుడిని రూపొందించారు. విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు.. 5 రోజులు శ్రమించి ఈ ప్రతిమను రూపొందించారు. రేపాలవారి వీధిలో నెమలి పింఛాలతో ఏర్పాటుచేసిన బొజ్జ గణపయ్య చూడముచ్చటగా ఉన్నాడు. సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లో ఎండు కొబ్బరి గణపతి కొలువుదీరాడు.
నంద్యాలలో జిల్లేడు గణపతి: నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం వద్ద తెల్ల జిల్లేడు గణేశుడిని ప్రతిష్టించారు. 18 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని శ్రీ శ్వేతార్క మహాగణపతిగా భక్తులు పూజిస్తున్నారు. కర్నూలు రామలింగేశ్వర నగర్‌లో 7 ద్వారాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. విశాఖ తాటిచెట్లపాలెంలో యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ గణేశ్' విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ వాడకుండా "ప్రపంచాన్ని పచ్చగా ఉంచండి" అనే సందేశాన్నిచ్చేలా ప్రకృతి గణపతిని రూపొందించారు.