తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వైకాపా నేతల వైఖరి కారణంగా.. తన అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మనస్థాపానికి గురయ్యారు. తన వారిని ప్రభుత్వ ఉద్యోగులూ ఇబ్బంది పెడుతున్నారని వంశీ ఆవేదన చెందారు. ఈ కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు వెల్లడించారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెబుతూ.. అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశానని చెప్పారు. తనకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా: వల్లభనేని వంశీ వైకాపా జోరులోనూ.. తెదేపాను నిలబెట్టి... చివరికిలా..!
గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ప్రభంజనం కనిపించింది. తెదేపా అనూహ్య ఓటమిపాలైంది. అయినా.. వల్లభనేని వంశీ ఏ మాత్రం అదరలేదు. బెదరలేదు. ప్రజల మద్దతుతో ఆయన గన్నవరం నుంచి తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా.. ప్రజల తరఫున నిలిచారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల భాజపా ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. వైకాపా నాయకత్వంతోనూ భేటీ అయ్యారు. వంశీ పార్టీ మారడం ఖాయమని అంతా భావించారు. ఇంతలో.. స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థుల వైఖరి కారణంగా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించిన వంశీ.. అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇదీ చదవండి:
గన్నవరం రాజకీయం... గరంగరం