వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇష్టదైవాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సహా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమలలోని మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు.
విశాఖ జిల్లాలోని ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దేవ స్వరూపం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. ఆలయ ఛైర్పర్సన్ సంచయిత గజపతి.. స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు సాక్షాత్కరించారు. ఉత్సవమూర్తులుగా దేవి సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా ముందుగా దర్శనమిచ్చి.. అనంతరం మూల విరాట్‌ను దర్శనం చేసుకునెలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నియమాలు అనుసరిస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ఉత్తర ద్వారం ముఖం గుండా వచ్చిన అర్చకులు, వేదపండితులు మంత్రోచ్ఛారణలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై అధిష్టింపజేసి మంగళవాయిద్యాల నడుమ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దేవతా మూర్తులకు మంగళ హారతులను ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నంద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో వెలిసిన శ్రీవెంకటేశ్వర స్వామిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. స్వామివారిని 10 లక్షల విలువైన కొత్త నోట్లతో అలంకరించారు. పాణ్యంలోని పురాతన దేవాలయమైన వీర నారాయణ స్వామి ఆలయంలో తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణల నడుమ ఆలయ అర్చకులు వేదమంత్రాలు చదువుతూ ఉత్తర ద్వారాలు తెరిచి దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పండితులు ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు.
కృష్ణా జిల్లా విజయవాడలో వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో 11అడుగుల ఏకశిలా విగ్రహం శ్రీ శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి స్వామి వారి పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక కైంకర్యాలు, పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చల్లపల్లి మండలంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు.
నూజివీడులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాస్కులు ధరించిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశాలను కల్పించారు. స్వామివారి దర్శనానంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు.గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.