New Train in Telangana: తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలున్న మెదక్‌కు.. రైలు సౌకర్యం లేకపోవడం పెద్ద లోటుగా ఉండేది. ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచే.. పట్టణానికి రైలు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. ప్రతి ఎన్నికల్లో మెదక్‌కు రైలు తీసుకొస్తామన్న హామీ సర్వసాధారణమైంది. దీంతో దశాబ్దాల పాటు ఎదురుచూసిన ప్రజలు.. చివరికి రైల్వే సాధన సమితి ఏర్పాటు చేసి.. ఉద్యమం ప్రారంభించారు. రైలు మార్గం నిర్మాణం ఆదాయపరంగా నష్టం వస్తుందనే కారణంతో.. కేంద్రం ఏళ్ల తరబడి ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ వచ్చింది. నిర్మాణ వ్యయంలో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో.. కాస్ట్ షేరింగ్ విధానంలో 2012-13 రైల్వే బడ్జెట్లో ఈ మార్గానికి మోక్షం లభించింది.
2015లో పనులు ప్రారంభం..: అక్కన్నపేట నుంచి మెదక్ వరకు కొత్త బ్రాడ్గేజ్ రైల్వేలైన్ మంజూరు చేశారు. రూ.118 కోట్లతో 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి అంచనా వేయగా.. పనుల అలసత్వంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. 2014 జనవరిలో రైల్వేలైన్ పనులకు శంకుస్థాపన చేయగా.. వెంటనే ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఒప్పందం ప్రకారం రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధులు విడుదల చేయడంతో.. 2015 సెప్టెంబర్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
40కి పైగా వంతెనలు..: ఈ ప్రాజెక్టు వ్యయంలో రూ.103 కోట్లు కేంద్రం, మరో రూ.103 కోట్లు రాష్ట్రం భరించాల్సి ఉండగా.. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు నత్తనడకగా సాగాయి. అక్కన్నపేట-మెదక్ మధ్య కొత్తగా నిర్మించిన 17.2 కిలోమీటర్ల దూరం రైల్వేట్రాక్‌లో.. 40కి పైగా వంతెనలు, రెండుచోట్ల ఆర్వోబీలు, మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇటీవల రూ.10 కోట్లు విడుదల చేయడంతో పాటు.. మిగిలిన నిధులు త్వరలో ఇస్తామనే ప్రభుత్వ హామీతో.. అధికారులు పనులన్నీ పూర్తి చేశారు. మెదక్ స్టేషన్లో రైళ్ల రాకపోకలను నియంత్రించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ వరకు ట్రయల్ రన్ పూర్తి చేశారు.