Tammineni Krishnaiah Murder Case: తెలంగాణ ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. ఏ9 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ10 నాగయ్య రెండో అదనపు జడ్జి ఎదుట లొంగిపోయారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని జిల్లా కారాగారానికి తరలించారు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
పథకం ప్రకారమే హత్య..: తమ్మినేని కృష్ణయ్యను వ్యక్తిగత కారణాలతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గతంలోనే న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తమ ప్రణాళికను అమలు చేయడానికి అవకాశం కోసం ఎదురుచూసిన నిందితులు ఆగస్టు 15న ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తెల్దారుపల్లి సమీపంలోని దోభీఘాట్ వద్ద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఏ1గా ఉన్న బోడపట్ల శ్రీను, ఏ5 కన్నెకంటి నవీన్ ఇద్దరూ.. హత్యకు ప్రణాళికలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏ6 జక్కంపూడి కృష్ణయ్య, ఏ7 మల్లారపు లక్ష్మయ్య.. తమ్మినేని కృష్ణయ్య కదలికలపై నిఘా ఉంచి.. బోడపట్ల శ్రీనుకు సమాచారం ఇచ్చారు.