Air Gun Fire Case: తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఎయిర్‌గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఫాంహౌస్ యజమాని ప్రసాద్ కాగా.. మరొకరు 17 ఏళ్ల బాలుడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో గొరిజాల వెంకట ప్రసాద్‌కు ఫాంహౌస్ ఉంది. ఫాంహౌస్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల.. ఆన్లైన్లో ఓ ఎయిర్‌గన్ కొనుగోలు చేశాడు. కోతులు రాకుడా ఫాంహౌస్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కోతులు రావటం కొంత తగ్గుముఖం పట్టటంతో.. ఎయిర్‌గన్‌ను ఫాంహౌస్ లోనే ఓ గదిలో ఉంచారు.
గ్రామంలో జాతర జరుతుండటంతో 5 రోజుల క్రితం ఫాంహౌస్ వాచ్మెన్ నాగరాజు ఇంటికి బంధువులు వచ్చారు. ఈ నెల 15న ఉదయం పూట పిల్లలు ఫాంహౌస్‌లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు గదిలో ఎయిర్‌గన్ కనిపించింది. సినిమాల్లో చూపించే తుపాకీలాగే ఉండటంతో.. పిల్లలు ఆకర్షితులై దానితో సెల్ఫీలు తీసుకున్నారు. అందులో ఓ 17 ఏళ్ల బాలుడు దాన్ని పరీక్షించేందుకు.. ఎయిర్గన్లో పిల్లెట్ లోడు చేసి ట్రిగ్గర్ నొక్కాడు. అదే సమయంలో వాచ్మెన్ నాగరాజు నాలుగేళ్ల కుమార్తె శాన్వి అటుగా వచ్చింది. ప్రమాదవశాత్తు.. ఆ పిల్లెట్ శాన్వి కుడి కణతపై తగిలింది. దెబ్బ తగిలిన వెంటనే ఆ చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు.. ముందుగా సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. 16న ఉదయం చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.