TSPSC Chairman: న్యాయ వివాదాలు తలెత్తకుండా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు, భర్తీ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, అనవసర ఆందోళనలతో పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురికావొద్దని అభ్యర్థులకు సూచించారు. నోటిఫికేషన్ల జారీ నుంచి రాతపరీక్షకు మధ్య సన్నద్ధతకు తగిన సమయం ఉంటుందన్నారు. జవాబు పత్రంలో బబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని కోరారు. నియామకాలపై అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టంచేశారు. జిల్లా స్థాయిలో ఏజెన్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ప్రతివారం సమీక్ష నిర్వహించి త్వరగా పోస్టింగులు ఇస్తామన్నారు. పరీక్షల్లో అభ్యర్థి ప్రతిభ మేరకు ఎంపికలు ఉంటాయని.. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. జనార్దన్‌రెడ్డి శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేశారు.
- అందరి దృష్టీ తెలంగాణ తొలి గ్రూప్-1పై ఉంది. ఈ పరీక్ష నిర్వహణ ఎలా ఉంటుంది?
గ్రూప్-1 సిలబస్‌ను 2015లో కమిషన్ ఖరారు చేసింది. ప్రస్తుతం అందులో మార్పులు ఉండవు. నోటిఫికేషన్ సమయంలోనే దరఖాస్తు చివరి తేదీతో పాటు ప్రిలిమినరీ, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించే సమయాన్ని సివిల్స్ తరహాలో ముందుగానే ప్రకటిస్తాం. ప్రధాన పరీక్షలకు ఈ-ప్రశ్నపత్రాన్ని అందిస్తాం. పరీక్ష కేంద్రంలో కంప్యూటర్ ముందు కూర్చుని ప్రత్యేక పాస్‌వర్డ్‌తో ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి ముందు, పరీక్ష ముగిసిన తర్వాత.. ఆ ప్రశ్నపత్రం కనిపించదు.
- ఎంపిక ప్రక్రియలో కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొస్తున్నారా?
అభ్యర్థుల జవాబు పత్రాలు ఇప్పటికే ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. పరీక్ష జరిగిన మరుసటి రోజునే ఆ ప్రశ్నపత్రం ప్రాథమిక కీ వెలువరించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఏమైనా అభ్యంతరాలుంటే.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిపుణుల కమిటీకి సిఫార్సుచేసి, కమిటీ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ఇంటర్వ్యూలు పూర్తి పారదర్శకంగా నిర్వహించే వ్యవస్థను ఇప్పటికే కమిషన్ సిద్ధం చేసింది.
- గతంలో జారీచేసిన నోటిఫికేషన్లఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి కదా..?
ఉద్యోగ ప్రకటనలకు అర్హతలు ఖరారు చేయడంలో సంబంధిత విభాగాలు చేసిన పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. ఉదాహరణకు పీఈటీ పోస్టులకు డిప్లొమా, బీపీఈడీ అర్హతలపై స్పష్టత లేకపోవడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 600 పోస్టుల ఫలితాలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొన్ని కేటగిరీల పోస్టులదీ ఇదే సమస్య. ఇవి మరో 600 వరకు ఉన్నాయి. ఏఎన్ఎం పోస్టులు(238), పీవీ నరసింహారావు విశ్వవిద్యాలయం (126) పోస్టుల ఫలితాలు వెల్లడించేందుకు తుది ప్రక్రియ కొనసాగుతోంది.
- న్యాయవివాదాలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
రోస్టర్ తయారీ, రిజర్వేషన్ల ఖరారు, విద్యార్హతలు నిర్ణయించడంలో సంబంధిత విభాగాల పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఈ తరహా వివాదాల్లేకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు కమిషన్ తరఫున ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు దొర్లితే వెంటనే సరిచేసుకుంటాం. ఎవరైనా కావాలని న్యాయవివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే.. కోర్టులలో అఫిడవిట్లు దాఖలు చేసి ఉద్యోగాల భర్తీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం.
- రాష్ట్రపతి నూతన మార్గదర్శకాల నేపథ్యంలో ఓటీఆర్‌లో వ్యక్తిగత వివరాలను ఎలా సరిచేస్తారు?