కుటుంబానికి చెందిన వ్యక్తి కారణంగా ఓ 16 ఏళ్ల బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ గర్భవిచ్ఛిత్తి చేపట్టాలని ఆదేశించింది. పిండం నుంచి టిష్యూ, రక్త నమూనా, డీఎన్‌ఏను సేకరించి భద్రపరచాలని ఆదేశించింది. బాధిత బాలికపై కుటుంబానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ బెదిరించి నోరు నొక్కేశాడు. సెప్టెంబరు 9న బాలిక అనారోగ్యానికి గురికాగా.. కోఠి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. గర్భం దాల్చినట్లు (పిండం వయసు 25 వారాలు) తేలింది. దీనిపై తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఆంజనేయులు అనే వ్యక్తి కారణమని చెప్పడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు గర్భవిచ్ఛిత్తి చేసేందుకు గడువు దాటిపోయిందంటూ ఆసుపత్రి నిరాకరించడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి నిపుణుల సిఫార్సు నివేదికను పరిశీలించి గర్భవిచ్ఛిత్తి చేసేందుకు ఆసుపత్రికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చట్టప్రకారం పరిమితులకు లోబడి..