హైదరాబాద్ పేరు చెప్పగానే నిత్యం స్తంభించే ట్రాఫిక్కు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులే గుర్తుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాహనదారులు రయ్‌రయ్‌మని దూసుకెళుతున్నారు. కారణం.. రాజధాని రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతో భారీ ఎత్తున నగరవాసులు స్వస్థలాలకు వెళ్లిపోవడమూ ఇందుకు కారణమైంది. రోజూవారీ తిరిగే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పోలీసుల సర్వేలోనూ వెల్లడైంది.
హైదరాబాద్ మహానగరంలో సుమారు కోటి మంది జనాభా ఉంటారు. 60 లక్షల వాహనాలున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సిటీ బస్సుల్లో రోజూ 30 లక్షల మంది ప్రయాణించే వారు. లాక్‌డౌన్‌తో సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌లు ఆగిపోవడంతో చాలా మంది సొంత వాహనాలపై రాకపోకలు ప్రారంభించారు. రోజూ వారీ తిరిగే వాహనాల సంఖ్య మరింత అధికమైంది. గత 15 రోజులుగా కరోనా కేసుల సంఖ్య 500 నుంచి 1000 మధ్య నమోదవుతోంది. నగర ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. దీంతో రోడ్లపై జనసంచారం తగ్గుముఖం పట్టింది. ఒకానొక దశలో రాజధానిలో కొన్ని రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేసింది. దీంతో భారీ ఎత్తున నగర ప్రజలు అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణ జిల్లాల్లోని పల్లెలకు పయనమయ్యారు. సొంత వాహనాలతోపాటు అద్దె వాహనాల్లో తరలిపోయారు. ఇప్పటికీ తరలివెళుతూనే ఉన్నారు. దీనివల్ల రోడ్లపై తిరిగే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొన్ని సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ ఉంటోంది తప్ప రోడ్లపై తక్కువగానే కన్పిస్తోంది. ఆటోల సంచారమూ తగ్గిపోయింది.
- గతంలో కూకట్‌పల్లి నుంచి ఎల్బీనగర్‌కు రద్దీ సమయంలో వాహనంపై రావాలంటే దాదాపు గంటంపావు సమయం పట్టేది. అయిదారు చోట్ల ట్రాఫిక్ స్తంభించేంది. ఇప్పుడు 45 నిమిషాల్లోనే ఎక్కడా ఆగకుండా చేరేందుకు వీలవుతోంది.
- అత్తాపూర్ నుంచి ఖైరతాబాద్‌కు గతంలో గంట సమయం పట్టేది. ఇప్పుడు 30 నుంచి 40 నిమిషాల్లో చేరుతున్నారు.
సర్వే సారాంశం ఇది..
చేసిన సమయం:జూన్ 29 నుంచి జులై 3 మధ్య