- Traffic Issues in Telangana: వాహనాలు నిబంధనల మేరకు సాఫీగా వెళ్లేలా చేయడం ట్రాఫిక్ పోలీసుల విధి. ఒకప్పుడు ఇదే వారి పనితీరుకు కొలమానంగా ఉండేది. ఇప్పుడు.. రోజుకు ఎన్ని చలానాలు వేశావు.. ఎంతమేర ఖజానాకు రాబడి తెచ్చావు అనేది కొలబద్దగా మారింది. కెమెరాలు చేతపట్టి వాహనదారుల ఉల్లంఘనలను ఫొటోలు తీయడంలో నిమగ్నమవుతున్న పోలీసులు ట్రాఫిక్‌ను గాలికి వదిలేస్తున్నారు.
- హైదరాబాద్ పోలీసుల కొత్త నినాదం పోలీసు రహిత కూడళ్లు(కాప్‌లెస్ పోలీసింగ్). ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే నిబంధనలు పాటించని ఆకతాయిలు.. ఈ కొత్త విధానంతో మరింత రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రుళ్లు వరకు మద్యం తప్పతాగి వాయు వేగంతో రోడ్లపై దూసుకెళుతున్నారు.
ఈ రెండు కారణాలు నగరంలో పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. మద్యం తాగి వేగంగా వాహనాలు నడుపుతున్న కారణంగా అనేకమంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నళ్లున్న కూడళ్లు 340. ప్రతి సిగ్నల్ వద్ద కాకపోయినా రద్దీ కూడళ్లలోనైనా నలుగురైదురుగు ట్రాఫిక్ పోలీసులుంటే వాహనదారులకు కొంత భయం ఉంటుంది. మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసు విభాగం గత ఏడాదిన్నర కాలంగా అమెరికా, ఇంగ్లండ్ పోలీసింగ్ విధానాలను అవలంబిస్తోంది. బ్రిటన్‌లో రద్దీ రోడ్లపైకి వాహనాలు ఎక్కాలంటే రోజు, సమయం ఆధారంగా ట్రాఫిక్ ఫీజు భారీగా చెల్లించాలి. అందుకే అక్కడి ప్రధాన మార్కెట్ల వద్ద వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మనకు అటువంటి విధానాల్లేవు. రద్దీ రోడ్లలోనూ వాహనదారులు దూసుకెళుతున్నారు.