మార్కెట్లో టమాటా కొనాలంటే.. కిలో రూ.12 నుంచి రూ.18 వరకు పలుకుతోంది. మరోపక్క రైతులేమో గిట్టుబాటు ధర దక్కక పారబోస్తున్నారు. కనీసం కోత ఖర్చులూ రావడం లేదని పొలాల్లోనే వదిలేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలోకు కనిష్ఠంగా రూ.7 లభిస్తుంటే.. పక్కనున్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రెండు రూపాయలు కూడా దక్కడం లేదు.
పంట ఉత్పత్తులకు ఎక్కడెంత ధర లభిస్తుందో రోజువారీ తెలుసుకునేలా సీఎం యాప్ తెచ్చారు. ధర తగ్గితే.. మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ పత్తికొండ మార్కెట్లో మూడు రోజుల నుంచీ కొన్నది 103 క్వింటాళ్లే. ఇప్పుడు కోత కోయొద్దని, మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా ధరలు పతనం కొనసాగుతుండటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘రెండెకరాల్లో సాగు చేశా.. మార్కెట్‌కు తెచ్చినా అరకొర ధరే ఇస్తుండటంతో పొలంలోనే కోయకుండా వదిలేశాను’ అని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కొండగేరికి చెందిన శివ వాపోయారు. ‘15 కిలోల పెట్టెకు రూ.30 మాత్రమే ఇస్తున్నారు. అందుకే పంట కోయడం లేదు. ఇవే ధరలు కొనసాగితే గొర్రెలకు వదిలేస్తా’ అని అనంతపురం జిల్లా కామక్కపల్లికి చెందిన నాగరాజు ఆవేదనగా చెప్పారు.
కిలో రూ.5కు సరకంతా కొనాలి