లాక్‌డౌన్ పరిస్థితులు టమాటా రైతులను నష్టాల్లో ముంచుతున్నాయి. పంట ధర బాగా పతనం కావడం వల్ల కోసి మార్కెట్‌కు తెస్తే ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
తెలంగాణలో ఏటా 90,434 ఎకరాల్లో టమాటా సాగవుతుండగా, ప్రస్తుత యాసంగి (రబీ)లోనే 60 వేల ఎకరాల్లో వేశారని ఉద్యానశాఖ తెలిపింది. ఈసారి అనుకూల వాతావరణంతో పాటు సాగునీటి లభ్యత వల్ల 7 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేసింది.
సాధారణంగా రోజువారీ 30-40 శాతం సరకును కొనుగోలు చేసే హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు మూతపడడం వల్ల కొనుగోళ్లు తగ్గిపోయాయని రైతుబజార్ విభాగం రాష్ట్ర అధికారి రవికుమార్ తెలిపారు. ఏటా మే నెల నాటికి ఎండల తీవ్రత వల్ల కూరగాయల కొరత ఏర్పడి క్రమంగా ధరలు పెరుగుతుండేవి.
ఈసారి వాణిజ్య, టోకు అమ్మకాలు లేక గిరాకీ, ధర పడిపోయింది. టోకు మార్కెట్లలో టమాటాను కిలో రూ.2కే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. దిగుబడి అధికమై, డిమాండు లేకపోవడం వల్ల ధర తగ్గినట్లు ఉద్యాన సంచాలకులు వెంకట్రాంరెడ్డి ‘ఈటీవీ భారత్‌కు తెలిపారు. టమాటాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టామన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు