తెలంగాణ ఐటీశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాలికి గాయమైంది. గాయం మానేందుకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇవాళ ప్రమాదవశాత్తూ జారిపడడంతో గాయమైనట్లు ఆయన వెల్లడించారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీకి సంబంధించిన కార్యక్రమాలు, సినిమాల గురించి తనకు సలహాలు ఇవ్వాలని అభిమానులను కేటీఆర్ కోరారు.
రేపు కేటీఆర్ జన్మదినం ఉన్న సందర్భంలో ఇలా ఆయన అస్వస్థతకు గురికావటం ఆయన అభిమానులకు బాధ కలిగించింది. ఇప్పటికే.. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, తెరాస శ్రేణులకు.. మధ్యాహ్నం కేటీఆర్ చేసిన విజ్ఞప్తితో కొంత నిరాశలో ఉన్నారు. రాష్ట్రంలో భారీ వరదల కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని.. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఇక.. అస్వస్థత విషయం తెలియటంతో మరింత నిరుత్సాహపడినట్టు తెలుస్తోంది.