తెలంగాణ వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ఊకచెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. వాగుపై నిర్మించిన లో లెవల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైకుతో పాటు వాగులో పడిపోయాడు. ప్రవాహ ఉద్ధృతికి చూస్తుండగానే ముగ్గురూ కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడే ఉన్న ముగ్గురు యువకులు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారు సంతోషమ్మ, పరిమళ, సాయికుమార్‌గా గుర్తించారు. మదనాపురం నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
చూస్తుండగానే.. బైక్‌తో సహా వాగులో పడి ముగ్గురు గల్లంతు - telangana crime news
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైకుతో పాటు వాగులో పడిపోయారు. గత నెలలో ఓ యువకుడు కూడా ఇదే వాగులో గల్లంతై మృత్యువాతపడ్డాడు.
సెప్టెంబర్ 7న ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు కొత్తకోట నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా ఇదే వాగులో గల్లంతై మృత్యువాతపడ్డాడు. నెల రోజులు గడవక ముందే మరోసారి ముగ్గురు గల్లంతు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తునప్పుడు వాహనదారులను ఆ మార్గం గుండా అనుమతించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాగు పొంగినప్పుడు పోలీసులు భద్రత చర్యలు చేపడితే.. ఇలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు సైతం ప్రవాహ వేగాన్ని అంచనా వేయకుండా దాటేందుకు ప్రయత్నించడం కూడా ప్రమాదాలకు మరో కారణమవుతోంది.
ఇవీ చదవండి: