ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 21, 2021, 2:55 PM IST

Updated : May 21, 2021, 5:47 PM IST

ETV Bharat / city

రఘురామ బెయిల్ పిటిషన్‌: ముకుల్ రోహత్గీ వర్సెస్ దుష్యంత్ దవే

ముకుల్ రోహత్గీ వర్సెస్ దుష్యంత్ దవే
ముకుల్ రోహత్గీ వర్సెస్ దుష్యంత్ దవే

14:52 May 21

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదించగా... ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. విచారణలో ఒకానొక సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం ఇరువైపుల న్యాయవాదులను మందలించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సీఎం కక్షపూరిత చర్యలకు దిగారని రోహత్గీ వాదించగా... కరోనా వేళ ఇదంతా సరికాదని రఘురామకు సమయం ఇచ్చామని దవే వివరించారు.

రఘురామ బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఎంపీ రఘురామ వైద్య పరీక్షల నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. బెయిల్ పిటిషన్‌పై రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సీఎం కక్షపూరిత చర్యలకు దిగారని రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేశారని రఘురామపై కక్షగట్టారని రోహత్గీ వాదించారు.

కాలి బొటనవేలు పక్కన ఫ్రాక్చర్‌ అయ్యింది..

జగన్ ప్రతివాదిగా లేనందున దీనిలోకి లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది చెబుతానని రోహత్గీ స్పష్టం చేశారు. ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగువులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది. బెయిల్ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. అరెస్టు, మెజిస్ట్రేట్, హైకోర్టు విచారణ పరిణామాలు వివరించారు. ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ఫ్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారని... కేదార్‌నాథ్ కేసు తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. ఇక్కడ రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్ అని రోహత్గీ వాదించారు.

ఎంపీ రఘురామ తరపు న్యాయవాదుల వాదనలు ముగిసిన అనంతరం... ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే ప్రారంభించారు. ప్రభుత్వ అఫిడవిట్ కాపీని చదివి వినిపించారు. రఘురామ ఎంపీ అని రోహత్గీ పదేపదే చెప్తున్నారు, చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

గాయాలకు గల కారణాలు లేవు... 

ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ ఇక్కడ పిటిషన్ ఎలా వేస్తారు?. రెండువర్గాలను రెచ్చగొట్టేలా రఘురామ మాట్లాడారు కరోనా వేళ ఇదంతా సరికాదని రఘురామకు సమయం ఇచ్చాం. రఘురామ అన్ని హద్దులు మీరారు. ఎంపీకి చెందిన 45 వీడియోలు సేకరించి సీఐడీ ప్రాథమిక విచారణ చేసింది. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి రేపేందుకు యత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందకే వస్తాయి.-ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే

హైకోర్టు ఆలా చెప్పింది...

బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు చెప్పిందని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే సుప్రీంకోర్టుకు వివరించారు. ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీంకోర్టు ఎలా వస్తారు..? అని ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై అభ్యంతరం లేదని, జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైందేనని వివరించారు. ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని దవేను ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు కనుక విచారణ మంగళవారానికి వాయిదా వేయాలని దవే కోరారు.

Last Updated : May 21, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details