సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకూ కాసులు కురిపిస్తోందన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. కొందరు నేతలు, అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు, వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) వద్ద మద్యం సరఫరాకు దాదాపు 100 కంపెనీలు నమోదై ఉన్నాయి. వీటిలో 16 కంపెనీలపైనే ఏపీఎస్‌బీసీఎల్ అంతులేని ప్రేమ కనబరిచింది. 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 73.92% మద్యం సరఫరా ఆర్డర్లను ఆ సంస్థలకే కట్టబెట్టింది. విలువ ప్రకారం చూస్తే అది 62 శాతం. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందిన, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న వారివేననే ప్రచారం ఉంది.
2019 డిసెంబరు 2న ‘అదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.
‘మద్యం అధికార పార్టీ కీలక నేతలకు కాసులు కురిపిస్తోంది.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఏపీఎస్‌బీసీఎల్‌లోని ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోంది.. ఏ కంపెనీ నుంచి, ఏ బ్రాండు మద్యాన్ని ఎంత కొనాలో వారే నిర్ణయిస్తున్నారు’.. అని ప్రతిపక్షాలు తొలి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలాగానే ఏపీఎస్‌బీసీఎల్ మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తోంది. సొంత డిస్టిలరీలు లేకున్నా వేరేవాటిని సబ్‌లీజుకు తీసుకుని తమ బ్రాండ్ల మద్యం తయారు చేయించుకున్న కంపెనీలకూ, ప్రభుత్వం మద్యం వ్యాపార నిర్వహణ ప్రారంభించిన రెండు నెలల తర్వాత పుట్టిన కంపెనీకీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధి గుప్పిట్లో ఉందనే ప్రచారమున్న సంస్థకూ భారీ మొత్తాల్లో ఆర్డర్లు లభించాయి. తమిళనాడు వారి యాజమాన్యంలో ఉన్న కొన్ని కంపెనీలకు భారీగానే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఈ వివరాల్ని విశ్లేషించి.. ఆ కంపెనీలు ఎవరివని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
ఆ 16 కంపెనీలకే రూ.11,040.65 కోట్లు..
2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 25 నెలల్లో ఏపీఎస్‌బీసీఎల్ వివిధ కంపెనీలకు.. రూ.17,570.49 కోట్ల విలువైన 10.28 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు (ఓఎఫ్‌ఎస్) ఇచ్చింది. అందులో రూ.11,040.65 కోట్ల విలువైన 7.60 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రూవరీస్ డివిజన్), ఎస్‌ఎన్‌జీ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఆర్‌కే స్పిరిట్స్, రాడికో ఖైతాన్, పెరల్ డిస్టిలరీస్ లిమిటెడ్, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బీఆర్‌కే స్పిరిట్స్, శార్వాణి ఆల్కో బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటినీ బయోప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంబర్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఆర్ అసోసియేట్స్ కంపెనీ, ఈగల్ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్‌లకే ఆర్డర్లు దక్కాయి.
కొత్త మద్యం విధానం వచ్చాక ఏర్పాటైన కంపెనీకి రూ.1,164 కోట్ల ఆర్డర్లు..
* వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2019 అక్టోబరు 2 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించటం ప్రారంభించింది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ‘అదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది.
* ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2021లో 5 నెలలు (జనవరి నుంచి జూన్ వరకూ) డైరెక్టర్‌గా వ్యవహరించారు.
* సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే (2019 డిసెంబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య) రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.
వేరే డిస్టిలరీలు సబ్‌లీజుకు తీసుకుని..
* సొంత డిస్టిలరీలు లేకపోవడంతో అదాన్ సంస్థ.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల రాజేష్ 2020 నవంబరు 10 వరకూ డైరెక్టర్‌గా కొనసాగిన విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు సంబంధించిన పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజుకు తీసుకుని తమ కంపెనీ బ్రాండ్ల మద్యం తయారు చేయిస్తోంది.
* ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, అదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాట్ ప్రీమియం క్లాసిక్ విస్కీ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొన్నాళ్లపాటు ఈ కంపెనీ బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్మాలని సిబ్బందికి లక్ష్యాలు కూడా విధించడం గమనార్హం.
అధికార పార్టీ కీలకనేత గుప్పిట్లోని కంపెనీకి రూ.1,863 కోట్ల ఆర్డర్లు
* రాయలసీమలోని ఓ దివంగత నేతకు చెందిన కంపెనీకి రూ.1,863 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. దీని వెనుక పెద్ద కథే ఉంది. వైకాపా అధికారం చేపట్టిన అప్పటి నుంచి ఆ కంపెనీ.. అధికార పార్టీలో చక్రం తిప్పే, అత్యంత సీనియర్ నేత అయిన ప్రజాప్రతినిధి కుమారుడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. అతనూ ప్రస్తుతం ప్రజాప్రతినిధే. ఆ నాయకుడి గుప్పిట్లోనే ఇప్పుడు అక్కడ రకరకాల బ్రాండ్లు తయారవుతున్నాయి.
* ఈ కంపెనీకి 25 నెలల్లో (2019 అక్టోబరు 2 - 2021 నవంబరు 30) 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్ ఆర్డర్లు ఇచ్చింది. వీటి విలువ ఏకంగా రూ.1,863.12 కోట్లు.
ఒకే ప్రాంగణం, చిరునామాతో ఉన్న రెండు కంపెనీలకు రూ.774.71 కోట్ల విలువైన ఆర్డర్లు..
* ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, జేఆర్ అసోసియేట్స్ కంపెనీలు రెండూ ఒకే ప్రాంగణంలో, ఒకే భవనంలో నడుస్తున్నాయి. ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ప్లాట్ నంబర్-64, రోడ్డు నంబర్-2 చిరునామాతో ఉండగా, జేఆర్ అసోసియేట్స్ అనే మరో కంపెనీ ప్లాట్ నంబర్ 64/ఏ, స్ట్రీట్ నంబర్-1, రోడ్డు నంబర్-2 సాగర్ సొసైటీ, బంజారాహిల్స్, హైదరాబాద్ చిరునామాతో ఉంది. అయితే ఈ రెండు చిరునామాలు ఒకే భవనానికి సంబంధించినవిగా ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది. ఈ రెండు కంపెనీల యజమాని పేరు జైపాల్‌రెడ్డే. ఈ రెండింటికీ కలిపి ఏపీఎస్‌బీసీఎల్ ఏకంగా రూ.774.71 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది.