ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌పై ఆర్‌బీఐ ప్రశ్నల వర్షం.. తక్షణమే సమాధానమివ్వాలని లేఖ

రాష్ట్ర ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌పై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. సంస్థ కార్యకలాపాలపై 9 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించి వాటికి సమాధానం చెప్పాలని కోరింది. ఆర్‌బీఐలో ఉన్నత స్థాయి నుంచి ఈ సమాచారం కోరుతున్నారని, ఆలస్యం చేయకుండా వెంటనే పంపాలని సూచించింది.

rbi
rbi

By

Published : Oct 10, 2021, 9:12 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) కార్యకలాపాలపై రిజర్వు బ్యాంకు దృష్టి సారించింది. 9 ప్రశ్నలను సంధిస్తూ తక్షణమే సమాధానాలు పంపాలని కోరింది. ఆర్‌బీఐలో ఉన్నత స్థాయి నుంచి ఈ సమాచారం కోరుతున్నారని, ఆలస్యం చేయకుండా వెంటనే పంపాలని సూచించింది. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు రిజర్వు బ్యాంకు హైదరాబాద్‌ కార్యాలయం నుంచి ఈ లేఖ అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఏపీఎస్‌ఎఫ్‌సీ ప్రభుత్వ అంతర్గత కార్పొరేషన్ల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోంది. వివిధ బోర్డులు, సొసైటీల వద్ద ఉన్న నిధులు తమ దగ్గర డిపాజిట్‌ చేస్తే వడ్డీ చెల్లిస్తామంటూ వారి ప్రతినిధి జులై నెలలో లేఖలు రాసి మరీ నిధులు సమీకరించారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు, వివిధ కార్యక్రమాలకు మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఆస్తులు, ఆదాయాలు, అప్పులు తదితర అంశాలపై ఆర్‌బీఐ ఆరా తీసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వారు కోరిన సమాచారం ఇదీ..

*ఈ కంపెనీ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ-నాన్‌ డిపాజిట్‌ (టైపు 2) విభాగంలో రిజిస్టరయినట్లు పేర్కొంటూ.. 2021 మార్చి 31న ఈ కార్పొరేషన్‌కు సంబంధించిన స్టాట్యుటరీ ఆడిట్‌ చేసి ఉంటే ఆ వివరాలన్నీ సమర్పించాలి.

*2021 మార్చి నాటికి బ్యాలెన్సు షీట్‌, లాభనష్టాల వివరాలు తెలియజేయాలి. తుది బ్యాలెన్స్‌ షీట్‌ అందుబాటులో లేకపోతే ఆ రోజు నాటికి కంపెనీ ఆస్తుల వివరాలు సమర్పించాలి.

*2021 ఆగస్టు 31 నాటికి కంపెనీకి ఉన్న ఆస్తుల వివరాలూ పేర్కొనాలి. కంపెనీ ఆస్తులు, అప్పులు ఏమిటి? 2021 ఆగస్టు 31 నాటికి ఉన్న ఫైనాన్షియల్‌ ఆస్తులకు సంబంధించి పీబీసీ (ప్రిన్సిపల్‌ బిజినెస్‌ క్రైటీరియా) నిబంధనలు అమలవుతున్నాయో లేదో తెలియజేయాలి.

*కంపెనీ సొంత ఆస్తులేంటో చెప్పాలి.

*ఈ కంపెనీ తన అప్పులను ఏ రకంగా తిరిగి చెల్లిస్తోంది?

*ఈ కంపెనీ ఏమైనా ఆదాయం సంపాదిస్తుందా? సంపాదిస్తుంటే ప్రిన్సిపల్‌ బిజినెస్‌ క్రైటీరియా నిబంధనల ప్రకారమే సాగుతోందా?

*ఈ కంపెనీ ఏ లావాదేవీలు నిర్వహిస్తోంది? ఆ కార్యనిర్వహణ పద్ధతులేంటి?

*కార్పొరేషన్‌ అంతర్గత కార్పొరేట్‌ డిపాజిట్లను స్వీకరిస్తోందా? అలా చేస్తుంటే ఏ సంస్థల నుంచి స్వీకరించారు? 2021 మార్చి 31 నాటికి అలా స్వీకరించిన డిపాజిట్ల మొత్తం ఎంత? 2021 ఆగస్టు 31 నాటికి స్వీకరించిన మొత్తం ఎంత? వీటికి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు? ఆ డిపాజిట్లను ఏ రూపంలో వినియోగిస్తున్నారు? వాటికి వడ్డీ చెల్లించేందుకు నిధులు ఎక్కణ్నుంచి వస్తున్నాయి?

*ఈ కంపెనీ ఏమైనా బ్యాంకుల నుంచి రుణాలు స్వీకరించిందా? తీసుకుంటే ఎంత మొత్తం, ఎంత కాలానికి ఎంత వడ్డీకి తీసుకున్నారు? ఈ రుణాలు తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్‌కు ఉన్న ఆదాయ మార్గాలేంటి?

ఏపీఎస్‌డీసీపై నాడు ఆరా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రుణాల సమీకరణకు ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌పై గతంలో కేంద్ర ఆర్థిక శాఖ, వ్యయ విభాగం వివరాలు కోరాయి. కార్పొరేషన్‌ ఏర్పాటు తీరుతెన్నులను ప్రశ్నించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌కు ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు విరుద్ధంగా ఉందంటూ ప్రస్తావించాయి. ఇప్పుడు రిజర్వుబ్యాంకు దీనిపై ఆరా తీయడమే కాకుండా తమ ఉన్నతస్థాయి వర్గాలకు సమాచారం అందించాల్సి ఉందని కూడా పేర్కొనడం గమనార్హం.

ఇదీ చదవండి:సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై తీసుకున్న చర్యలేంటి.. ? : కేంద్ర హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details