ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన... రాష్ట్రప్రభుత్వాలకు కొత్త మార్గదర్శకాలు

New regulations ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(PMSKY) కింద ప్రాజెక్టుల గుర్తింపు, నిధుల విడుదలకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పంపింది.

New regulations from Union Ministry of Water Energy
రాష్ట్రప్రభుత్వాలకు కొత్త మార్గదర్శకాలు

By

Published : Feb 9, 2022, 9:41 AM IST

Union Ministry of Water Energy దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం నిధులు మాత్రమే వస్తాయి. మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. దీంతోపాటు నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదలవుతాయి. ఇలా పలు నిబంధనలతో జాతీయ ప్రాజెక్టులకు, సత్వర సాగునీటి ప్రయోజనం(AIBP), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(PMSKY) కింద ప్రాజెక్టుల గుర్తింపు, నిధుల విడుదలకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పంపింది. ఆ మేరకు...

*ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం పది శాతం నిధులు సమకూర్చేవి. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాదు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందే ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా మారనుంది.
*ప్రతిపాదిత గోదావరి-కృష్ణా-కావేరి నదుల అనుసంధానాన్ని కేంద్రం చేపట్టినా, 40 శాతం నిధులను రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు భరించాల్సి ఉంటుంది.
*ఇప్పటివరకు దేశంలో 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించగా, ఇందులో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు ఒక్కదానికే ఈ హోదా ఉంది. ఈ ‘పోలవరం’తో పాటు హుషికుర్ద్‌, సరయు నహర్‌ పరియోజన, షాపూర్‌కండి ప్రాజెక్టులకు మాత్రం ఇప్పటివరకు ఉన్న పద్ధతిలోనే నిధులు విడుదలవుతాయి.
*నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుత్తు వినియోగం తదితర సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్న అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టులను, నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులను జాతీయ హోదాతో చేపట్టనున్నట్లు కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
*ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి పూర్తి అర్హత ఉన్నా ఆ సమయంలో నిధుల అందుబాటు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తప్ప, అర్హత ఉందని జాతీయహోదా కల్పించరు.
*8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్‌, లద్ధాఖ్‌లలోనే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులిస్తుంది.
*నిర్మాణంలో భాగంగా వ్యయం పెరిగితే ఆమోదం పొందిన దాని కంటే 20 శాతం వరకే కేంద్రం భరిస్తోంది. అంతకు మించితే ఆయా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.
*జాతీయ హోదా లభించిన ప్రాజెక్టులకూ కేంద్ర ప్రాయోజిత పథకాల తరహాలోనే నిధులు విడుదలవుతాయి. రాష్ట్రం తన వాటాను జమ చేసి 75 శాతం నిధులను ఖర్చు చేయకపోతే తదుపరి వాటా నిధులు అందవు. లేదా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చుచేసి ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఆ నిధులను తిరిగి పొందవచ్చు.
*దేశంలో నీటి వినియోగం, ఆయకట్టు ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టులనూ జాతీయ హోదా కింద చేపడతారు.
*నీటి పంపిణీ, లభ్యత సమస్య లేకుండా ఒకే రాష్ట్రంలో ఉపయోగపడే ప్రాజెక్టయినా 2లక్షల హెక్టార్లకంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారు.

ఏఐబీపీ, పీఎంఎస్‌కేవై కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు నిబంధనలు

*సాగునీటి ప్రాజెక్టు నుంచి తాగునీటి మళ్లింపు, పంపిణీకి నిధులు ఇవ్వరు. మిగిలిన ఖర్చును మాత్రమే భరిస్తారు.
*ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో మాత్రం 90 శాతం కేంద్ర నిధులిస్తారు.
*డీపీఏపీ, డీడీపీ, గిరిజన ప్రాంతాలు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్‌, విదర్భ, ఒడిశాలోని కేబీఓ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కేంద్రం 60 శాతం నిధులను ఇస్తుంది. మిగిలిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు 25 శాతమే ఇస్తుంది.
*ఈ ప్రాజెక్టులకు అర్హత ఉన్నా నిధుల లభ్యత, ఆ సమయంలో ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేస్తారు.
*ఇప్పటికే ఏఐబీపీ, పీఎంఎస్‌కేవై పథకాల కింద కొనసాగుతున్న 99 ప్రాజెక్టులను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి:రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నా... చేతికి చిక్కలేదు.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details