నాడు- నేడు పథకం కింద పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన, ఇళ్ల స్థలాల మెరక చేయటం వంటి పనులకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు వినియోగించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులపై కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెదిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు మోపిదేవి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు , డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి సహా మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో 40 లక్షల రూపాయల మేర గ్రామసచివాలయాల నిర్మాణానికి కేటాయించాలని మంత్రి పెద్ది రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నియోజకవర్గానికీ కోటి రూపాయల కన్వర్జెన్స్ నిధులు ఇచ్చామని తెలిపారు. దానిని ఉపాధి హామీ పనులకు మ్యాచింగ్ ఫండ్‌గా కేటాయిస్తే 90 శాతం ఉపాధి హామీ నిధులు ఇస్తామని మంత్రి వెల్లడించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. రహదారులను అనుకుని నిర్మించే డ్రైన్లకు 70 శాతం ఉపాధి హామీ నిధులతో పాటు 30 శాతం నిధులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఇస్తామని తెలిపారు.
'నరేగా నిధులతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు' - మంత్రి పెద్దిరెడ్డి వార్తలు
ప్రతి నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయల గ్రామీణ ఉపాధి హామీ నిధులు కేటాయించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులను సూచించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి