'రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టలేం' - lulu group latest news on ap
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేది లేదని లూలూ సంస్థ తెలిపింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏపీలో ఈ ప్రక్రియ కుదరదని వ్యాఖ్యానించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా పెట్టుబడులు ఉంటాయని స్పష్టీకరించింది.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టబోమని లూలూ గ్రూపు భారతదేశ సంచాలకుడు అనంత్‌రామ్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖ నగరానికి షాపింగ్‌హబ్‌గా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రం, షాపింగ్‌మాల్, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణాలు చేపట్టాలని లూలూ సంస్థ భావించినట్లు ఆయన తెలిపారు. దీని కోసం 2వేల200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి... 7వేల మందికిపైగా స్థానికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించిందన్నారు. అయినా లూలూ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరిస్తున్నామని చెప్పారు.