శ్రీశైలానికి అక్టోబరులో వచ్చిన ప్రవాహం 636 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లో ఉభయరాష్ట్రాల అవసరాలకు తగినంత ఒక్క నెలలోనే వచ్చింది. అక్టోబరులోనే ప్రకాశం బ్యారేజీ నుంచి 640 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. వచ్చిన నీరు వచ్చినట్టు వృథా అవడం తప్ప ఎక్కడా టీఎంసీని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2009 అక్టోబరులో శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే ఎక్కువ వరద వచ్చింది. తక్కువ రోజులు ఎక్కువ ప్రవాహం నమోదైంది. అప్పట్లోని వరదపై నీటిపారుదల వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఓ లెక్క ప్రకారం ఇది 643.99 టీఎంసీలయితే, మరో అంచనా ప్రకారం ఇది 739 టీఎంసీలు. ఈసారి అక్టోబరులో 8రోజులు మినహా అన్ని రోజుల్లోనూ లక్ష క్యూసెక్కులపైనే నీరొచ్చింది. నెల మొత్తమూ భారీ ప్రవాహం కొనసాగడం అరుదని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఎక్కువగా వరద వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తర్వాత అవసరాలకు తగ్గట్టు వాడుకునే చొరవ కనిపించడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబరు31 వరకు కృష్ణా బేసిన్‌లో ప్రకాశం బ్యారేజీనుంచి 1251.73 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. 3710 టీఎంసీల గోదావరి జలాలు సైతం వృథా అయ్యాయి. మొత్తంగా ఈ 2నదుల నుంచి ఇప్పటికే 5వేల టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.
‘డ్యాం దిగువన ఏర్పడిన గొయ్యిని పూడ్చాలి’