రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్‌ను ప్రశ్నించింది. ప్లాంట్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? జాప్యానికి గల కారణాలేమిటి తదితర వివరాలతో మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు ఎన్ని, మూడోదశ కరోనా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, వివరాలతో మెమో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ను ఆదేశించింది. కొవిడ్ మూడోదశను సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ తన ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్... కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయులు తోట సురేశ్‌బాబు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతోంది.