తితిదే విషయంలో ఓ తెలుగు దినపత్రిక 2019లో ప్రచురించిన కథనంపై.. దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేసింది. తితిదే విజిలెన్స్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు ఠాణాలో.. 2019 డిసెంబర్ 14న నమోదైన కేసు దర్యాప్తునకు సంబంధించి... పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని డీజీపీని ఆదేశించింది. విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. తిరుపతి తూర్పు పీఎస్ ఎస్హెచ్వో దాఖలు చేసిన కౌంటర్లో సరైన వివరాలు లేవని ఆక్షేపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదంటూ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుబ్రమణ్యస్వామి హైకోర్టులో పిల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో ఆయన నేరుగా వాదనలు వినిపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వార్తా కథనం ఉందన్నారు. ఆ తరహా కథనాలను ప్రచురించే ముందు తితిదే ఛైర్మన్ అభిప్రాయాన్ని తీసుకోలేదని ఆరోపించారు. ఈ కేసును పోలీసులు చాల తేలిగ్గా తీసుకున్నారని వాదనలు వినిపించారు. ఇలాంటి తీవ్రమైన విషయాల్లో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు.