TIDCO houses to beneficiaries: గత ప్రభుత్వ హయాంలో చేపట్టి అత్యాధునిక వసతులతో పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గృహ సముదాయాల్లో చిన్న చిన్న వసతుల కల్పన మినహా ఇళ్ల నిర్మాణాలు అప్పట్లోనే పూర్తయినా.. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు అందించలేదు. దీనిపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తయిన గృహాలను ఎక్కడికక్కడ వారికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా డిసెంబరు నెలలో 45 వేల గృహాల్ని లబ్ధిదారులకు అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో పురపాలక సంఘాల పరిధిలో 2.62 లక్షల గృహాల్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో సముదాయంలో 1000 నుంచి 10 వేల వరకు గృహాలు ఉన్నాయి. గృహ సముదాయాల్లో ఇప్పటికే రహదారులు, తాగునీటి సౌకర్యం, మురుగు కాల్వలు, విద్యుత్తు ఏర్పాటు జరిగి నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను తొలివిడతలో లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. ఒక్కో సముదాయంలో 50 నుంచి 3 వేల వరకు ఇలాంటి గృహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెల్లూరులో 12 వేలు, విశాఖలో 4 వేలు, తూర్పుగోదావరిలో 6 వేలు, పశ్చిమగోదావరిలో 5 వేలు, గుంటూరులో 10 వేలు, కర్నూలులో 8 వేలు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటన్నింటినీ డిసెంబరు 15 నుంచి 25వ తేదీలోగా లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
ప్రభుత్వమే కట్టించే ఇళ్లను వెంటనే ప్రారంభించాలి: మంత్రి