సమగ్ర భూసర్వే ప్రాజెక్టు కింద సర్వే కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు, టెండర్ నోటీసులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది. రాష్ట్రంలో చేపట్టనున్న ఈ సర్వేకు సంబంధించి రూపొందించిన టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు ప్రభుత్వం పంపింది. హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో డ్రోన్లు, కార్స్ నెట్వర్క్, జీఎన్ఎస్ఎస్ రిసీవర్లతో భూసర్వే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్టు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్థార్థ జైన్ స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భూముల రీసర్వే చేయనున్న నేపథ్యంలో ఆసక్తి కలిగిన వారి నుంచి ప్రతిపాదనల్ని స్వీకరించనున్నట్లు సిద్థార్థ జైన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ, పట్టణ ప్రాంత నివాసాలు, ఇతర భూముల రీసర్వే కోసం డ్రోన్, ఏరియల్ ఫొటోగ్రఫీ సర్వే , లార్జ్ స్కేల్ మ్యాపింగ్ కోసం టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు.