రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16న 332 కేంద్రాల్లో కొవిడ్ టీకా వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి రోజు ప్రతి కేంద్రంలో వంద మంది చొప్పున 33,200 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వ్యాక్సినేషన్ కోసం విశాఖ జిల్లాలో అత్యధికంగా 32, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 15 కేంద్రాలను ఏర్పాటుచేశారు. తొలిరోజు ఏర్పాటయ్యే 332 కేంద్రాల్లోనే మరుసటి రోజునుంచి టీకా వేస్తారా? వాటి సంఖ్యను పెంచుతారా? అనే అంశంపై స్పష్టత రాలేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వీక్షించటానికి వీలుగా విజయవాడ జీజీహెచ్, విశాఖలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో పెద్ద టీవీ తెరలను ఏర్పాటు చేయనున్నారు.
టీకాల పంపిణీని ప్రధాని మోదీ ప్రారంభించాక ఆయన ప్రసంగాన్ని వినటానికి వీలుగా టీవీ తెరలను ఏర్పాటుచేస్తున్నారు. 16న జరిగే ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే విశాఖలో జరిగే కార్యక్రమంలో సీఎం, విజయవాడలోని కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొనే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాల పంపిణీపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సోమవారం వీడియో సమావేశంలో చర్చించనున్నారు.
టీకా ఎలా వస్తుందనేది ఉత్కంఠే