ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Viveka Murder Case: హత్యలో సునీల్, అతని సోదరుడి పాత్ర తోసిపుచ్చలేం: సీబీఐ - సీబీఐ వార్తలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. నిబంధనల మేరకే దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీబీఐ పేర్కొంది. హత్య కేసు దర్యాప్తులో సీబీఐ తమను వేధిస్తోందని కడప జిల్లాకు చెందిన సునీల్‌, అతని కుటుంబసభ్యలు,మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్‌ పాత్రను తోసిపుచ్చలేమని సీబీఐ పేర్కొంది.

Viveka Murder Case
హైకోర్టు

By

Published : Jul 30, 2021, 4:30 AM IST

Updated : Jul 30, 2021, 4:44 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును చట్ట నిబంధనల మేరకే నిర్వహిస్తున్నామని సీబీఐ... హైకోర్టులో కౌంటర్ వేసింది. కీలక దశలో ఉన్న దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకునే పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని పేర్కొంది. పిటిషనర్లు సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్ పాత్రను హత్య కేసులో తోసిపుచ్చలేం అని తెలిపింది. సునీల్ యాదవ్​కు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించాయని, వాటిని ప్రస్తుతం బయట పెట్టలేమని..ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని చెప్పింది. సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ వేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి.సునీల్ యాదవ్,అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ వేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

శైలి అనుమానాలకు తావిస్తోంది..

ఈ నేపథ్యంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలను బట్టి .. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వ్యవహారశైలి తీవ్ర అనుమానాలకు తావిస్తోందని తెలిపింది. దర్యాప్తులో భాగంగానే ఇతరులతో పాటు పిటిషనర్​ను దిల్లీకి పిలిపించామని... చట్ట ప్రకారం విచారణ జరిపామని సీబీఐ పేర్కొంది. సునీల్ యాదవ్ అంగీకారంతోనే పలు పరీక్షలు చేశామని , అయితే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించలేదంది. థర్డ్ డిగ్రీని ప్రయోగించామని పిటిషనర్ చెప్పడంలో వాస్తవం లేదని వెల్లడించింది. హత్య కేసుతో పిటిషనర్లకు సంబంధం లేదని ఏపీ పోలీసులు నిర్ధారించినట్లు చెప్పడం సరికాదని , అందుకు ఆధారాలు లేవని కొంటర్లో పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాద్ రాయ్ శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు.

ఇదీ చదవండి

VIVEKA MURDER: వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ

Last Updated : Jul 30, 2021, 4:44 AM IST

ABOUT THE AUTHOR

...view details