Roads are bad at Amaravati: రాజధాని అమరావతిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం, సచివాలయం లాంటి కార్యాలయాలు సేవలు అందిస్తున్నాయి. వీటిని చేరుకునేందుకు సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టినా పూర్తి కాకపోవడం, ప్రభుత్వం మారడంతో రహదారుల నిర్మాణం, నిర్వహణ నిలిచిపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వం ఆహ్వానం మేరకు కోట్ల రూపాయలు వెచ్చించి క్యాంపస్‌లు ఏర్పాటు చేసిన ప్రముఖ యూనివర్సిటీలకు.. ప్రస్తుతం కనీస రహదారి సౌకర్యం కూడా లేకుండా పోయింది.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కేటాయింపులు జరిగిన కొన్ని సంస్థలు అధికార మార్పిడి తర్వాత పరిణామాలతో వెనక్కి వెళ్లిపోయాయి. రాజధాని పనులు నిలిపివేతతో శంకుస్థాపన చేసిన ఎక్స్ఎల్ఆర్ఐ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. ఎస్ఆర్ఎం, విట్‌కు అప్పటి ప్రభుత్వం 200 ఎకరాల చొప్పున, అమృత యూనివర్సిటీకి 150 ఎకరాలు భూమి కేటాయించింది. భవిష్యత్తులో వైద్య కళాశాలలు, ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేయాలన్నది ఆ విద్యాసంస్థల ప్రణాళికలో భాగం. కానీ వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో.. ఆ ప్రతిపాదనల్ని ఈ సంస్థలు ప్రస్తుతానికి పక్కన పెట్టేశాయి. ప్రస్తుతం విట్‌లో 9 వేల మంది, ఎస్ఆర్ఎంలో 5 వేల 800 మంది విద్యార్థులున్నారు. అమరావతి అభివృద్ధిపై ఆసక్తిలేని ప్రభుత్వం.. అక్కడున్న విద్యా సంస్థల్నీ నిర్లక్ష్యం చేస్తోందని, రహదారులు వంటి కనీస మౌలిక వసతుల్నీ కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి కూడా సరియైన రహదారి సౌకర్యం లేదు.