Sanitation workers: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్లు కె.ఉమామహేశ్వరరావు, పి.సుబ్బరాయుడు తెలిపారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి లిఖితపూర్వక పత్రాలు శని, ఆదివారాల్లోగా పంపకపోతే.. సోమవారం మరోసారి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ‘కార్మికులకు ఆరోగ్య భత్యం రూ.6వేలు, జీతం రూ.15వేలతో కలిపి మొత్తం రూ.21వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సానుకూలమే.
అయినా, కార్మిక సంఘాలను చర్చలకు పిలవకుండా మంత్రి ఏకపక్షంగా ప్రకటించడం సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నెల 11న మంత్రులతో జరిగిన చర్చల్లో కార్మికుల సంక్షేమంతో పాటు నైపుణ్య, నైపుణ్యేతర జీతాల అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. ఎన్‌ఎంఆర్‌ల సమస్యలపైనా చర్చించారు. జీవో 6 ప్రకారం జీతం, కరవు భత్యం ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారు. ఆర్జిత సెలవు, హెల్త్‌కార్డులు, జీపీఎఫ్ ఖాతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలపైనా చర్చ జరిగింది.
వీటి అమలుపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వకపోతే సమస్య మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉంది. శనివారం ఉదయం నుంచి కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరవుతారు. లిఖితపూర్వక హామీ ఇవ్వడంలో తాత్సారం చేస్తే సోమవారం తర్వాత మరోసారి సమ్మెకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తాం’ అని ఉమామహేశ్వరరావు, సుబ్బరాయుడు అన్నారు.