TS DH on Omicron Variant : కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని.. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ఒమిక్రాన్ నివారణకు ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కొత్త వేరియంట్ కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే.. జాగ్రత్తగా ఉండటమొక్కటే మార్గమని అన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఇవాళ్టి నుంచి మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Omicron cases : ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, అందరు కరోనా టీకా రెండు డోసులు వేసుకోవాలని డీహెచ్ సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఒమిక్రాన్‌పై, కరోనా మూడో ముప్పుపై ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయని అన్నారు. విద్యాసంస్థల్లో పలువురి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తోందని.. వైరస్ ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని స్పష్టం చేశారు.
Omicron Variant : ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్‌లోకి రావొచ్చని డీహెచ్ అన్నారు. బుధవారం రోజున యూకే, సింగపూర్ నుంచి వచ్చిన 325 ప్రయాణికులకు టెస్ట్ చేశామని అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని ఆ వ్యక్తిని టిమ్స్‌లో చేర్పించామని తెలిపారు. ఆ వ్యక్తి టెస్ట్ రిపోర్టును జీనోమ్‌కు పంపామని.. అది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది రెండ్రోజుల్లో తేలుతుందని చెప్పారు.