రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తమ కేటాయింపులకు మించి మళ్లించడం కానీ, అదనపు ఆయకట్టు సాగు చేయడం కానీ లేదని, తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని, సరైనవి కావని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ట్రైబ్యునల్ ఎదుట తన వాదనను రాతపూర్వకంగా సమర్పించింది. తాము శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని మళ్లిస్తున్నామని, ఇది పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందన్నది ఊహాజనితమని, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు జాతీయ హరిత ట్రైబ్యునల్ పరిధిలోకే రావని తెలిపింది. కొత్త ప్రాజెక్టు అయితేనే 2006 పర్యావరణ చట్టం పరిధిలోకి వస్తుందని, రాయలసీమ ఎత్తిపోతల వీటి పరిధిలోకి రాదని వివరించింది.
ఈ పథకం వల్ల కొత్త ఆయకట్టు సాగులోకి రాదనడానికి ఉన్న వివరాలను ట్రైబ్యునల్‌కు ఇచ్చామంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1,2కు ఇచ్చిన ఆయకట్టు వివరాలతో కూడా పోల్చుకొని చూసుకోవచ్చంది. తమకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి వ్యవస్థలో చేసిన మార్పు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ట్రైబ్యునల్ పరిధిలోకి రాదని, రాయలసీమ ఎత్తిపోతలపై తదుపరి విచారణ లేకుండా నిర్ణయం తీసుకోవాలని కోరింది. నిపుణుల కమిటీలోని ఇద్దరు సభ్యుల అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ మాట్లాడుతోందంది.
వీరిద్దరూ రాయలసీమ ఎత్తిపోతల 2006 పర్యావరణ అనుమతి నోటిఫికేషన్ పరిధిలోకి వస్తుందని కానీ, నీటి కేటాయింపు అంకెలతో విబేధించడం కానీ చేయలేదని వివరించింది. రాయలసీమ ప్రాంతానికి 111 టీఎంసీల కేటాయింపు ఉందన్న కమిటీ అభిప్రాయాన్ని తప్పుపట్టడం సరైనది కాదంది. తెలంగాణలోని ఎక్కువ పథకాలు కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, కుడిగట్టు విద్యుత్తు కేంద్రానికి 800 అడుగులు, అంతకంటే దిగువ నుంచే తీసుకొంటారని, రోజుకు 28 వేల క్యూసెక్కులు అంటే రెండున్నర టీఎంసీలు మళ్లిస్తారని, అదే ఆంధ్రప్రదేశ్ 795 అడుగుల వద్ద ముచ్చుమర్రి పథకం ద్వారా తీసుకొనేది 795 క్యూసెక్కులు అంటే 0.1 టీఎంసీ మాత్రమేనని వివరించింది.
సీమ ఎత్తిపోతల ఆపండి... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరిన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరమని చెప్పిన నిపుణుల కమిటీ, ‘రాయలసీమ’ విషయంలో అందుకు భిన్నంగా నివేదించడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకాన్ని అనుమతించవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరింది. దీనిపై వాదనలను ముగించిన ట్రైబ్యునల్.. ఇంకేమైనా ఉంటే రాతపూర్వకంగా తెలపాలని సూచించింది. ఈమేరకు రెండు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి.