గుంటూరు జిల్లాలో
ప్రత్తిపాడు పరిధిలో రెండు కార్లు, ఆటోలో తరలిస్తున్న 454 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు కార్లు, ఆటోను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
చిత్తూరు జిల్లాలో
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 16 వేల 200 విలువ చేసే అక్రమ మద్యాన్ని అలిపిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 60 బాటిళ్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని.. మద్యాన్ని రవాణా చేస్తున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి జిల్లాలో విక్రయించాలని చూస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఆర్ఎల్ పురంలో అక్రమంగా తరలిస్తున్న 85 మద్యం సీసాలను పాతపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి సావరకోట మండలం నుంచి వస్తున్న వాహనంలో మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 13,500 ఉంటుందని పోలీసులు వివరించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొంచ పరిధిలో నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు నుంచి 114 నాటుసారా ప్యాకెట్లు తరలిస్తుండగా దాడులు చేసి.. స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
విశాఖపట్నంలో
గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ ఎయిర్పోర్టు సీఐ సయ్యద్ ఇలియాజ్ మహమ్మద్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం రాయఘడ పద్మాపుర్ ప్లాంట్ నుంచి విశాఖ మీదుగా బెంగళూరుకు గంజాయిని తరలించేందుకు ప్రణాళిక వేసుకున్నారనీ.. ఈ క్రమంలోనే ఎన్ఏడీ జంక్షన్ నుంచి వేరే మార్గంలో తరలిస్తుండగా.. పోలీసులు ముందస్తు సమాచారంతో దాడులు చేసి.. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులు అమాసర్, గౌరీలను అదుపులోకి తీసుకొని.. వారి నుంచి 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆలూరు రోడ్డు వద్ద కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన రఘు, బాబులు కర్ణాటకలో మద్యాన్ని కొనుగోలు చేసి దాచినట్లు వివరించారు. కర్ణాటక మద్యం దాచి ఉంచారన్న సమాచారంతో దాడులు చేసి రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని.. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఏటీఎం వరుస చోరీలపై దర్యాప్తు ముమ్మరం