కొవిడ్ మహమ్మారి కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తమ రాష్ట్ర శాసనసభకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. శాసనసభలో వైరస్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా తొలుత మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రపంచఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్యపెంపుతో పాటు కరోనా యోధులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
యోధులకు గుర్తింపు దక్కలేదు
అనంతరం చర్చలో పాల్గొన్న మజ్లిస్.. ప్రభుత్వ ప్రకటనలో కరోనాకు సంబంధించిన చాలా అంశాలు ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం ప్రాణాలకు ఎదురొడ్డి సేవలందించిన యోధులకు గుర్తింపు దక్కలేదని ఆ పార్టీ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆక్షేపించారు. ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. తమ పార్టీ తరఫున లక్ష ఆహార ప్యాకెట్లు సరఫరా చేసినట్లు వివరించారు. సమాజంలోని అన్ని రంగాలను కరోనా ప్రభావితం చేసిందని అక్బరుద్దీన్ అన్నారు.
సౌకర్యాలు లేవు
కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోగా... కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టలేక పోయారని విమర్శించారు. వైరస్ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.