ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: తెరుచుకోనున్న జూనియర్ కళాశాలలు

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతివ్వగానే.. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు సమాయత్తమైంది. షిఫ్టు పద్ధతిలో జూనియర్ కాలేజీలు నిర్వహించేందేలా రూపొందించిన ప్రతిపాదనలకు.. ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు రెండో సంవత్సరం.. మధ్యాహ్నం 1 నుంచి ఐదున్నర వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని.. అయితే కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని జలీల్ చెబుతున్నారు. సీబీఎస్ఈ తొలగించిన 30 శాతం పాఠాలనే ఇంటర్లో కుదించామని.. దానివల్ల జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తబోదన్నారు. భవిష్యత్తులోనూ ఇబ్బంది ఉండకుండా.. ఎక్కవగా అనుబంధ పాఠాలను మాత్రమే తొలగించామంటున్న జలీల్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Telangana: Junior colleges to be opened
తెలంగాణ: తెరుచుకోనున్న జూనియర్ కళాశాలలు

By

Published : Sep 22, 2020, 10:44 AM IST

తెలంగాణ: తెరుచుకోనున్న జూనియర్ కళాశాలలు

ప్రశ్న: కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమైన ఇంటర్ విద్యా సంవత్సరం ఎలా కొనసాగుతోంది?

జవాబు: కరోనా పరిస్థితుల వల్ల నాలుగు నెలలు అంతరాయం కలిగింది. విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనుమతితో.. ఆన్​లైన్ పాఠాలతో విద్యా సంవత్సరం ప్రారంభించాం. నిపుణులైన అధ్యాపకులతో దూరదర్శన్ ద్వారా బోధన జరుగుతోంది. మార్చి 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి... 30 శాతం సిలబస్ కుదించి 70 శాతం బోధించాలని నిర్ణయించాం. రెగ్యులర్ తరగతులు కూడా ప్రారంభించి.. ఆన్​లైన్, ఆఫ్​లైన్ కలిపి సిలబస్ పూర్తి చేయాలనుకుంటున్నాం.

ప్రశ్న: కొవిడ్ తీవ్రత ఇంకా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలలు తెరిచేందుకు ఎలా సిద్ధమవుతున్నారు?

జవాబు:అన్​లాక్-4 ప్రకారం ఈనెలాఖరు వరకు విద్యా సంస్థలకు అనుమతి లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తే.. ఇంటర్ కాలేజీలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. భౌతిక దూరం పాటించడం కష్టం కాబట్టి షిఫ్టు పద్ధతిలో కాలేజీలు నిర్వహించాలని భావిస్తున్నాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు రెండో సంవత్సరం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు కాలేజీలు నడిపేలా ప్రణాళికలు చేసుకుంటున్నాం. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి కూడా తెలిపింది..

ప్రశ్న: ఏ ప్రాతిపదికన సిలబస్ కుదించారు. భవిష్యత్తులో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయడానికి ఇబ్బందులు తలెత్తవా?

జవాబు: ఈ విద్యా సంవత్సరం సుమారు నాలుగు నెలలు నష్టపోయినందున.. ప్రత్యేక పరిస్థితుల్లో 30శాతం సిలబస్ కుదించక తప్పడం లేదు. సిలబస్ తగ్గించేందుకు సైన్స్, హ్యుమానిటీస్​కు రెండు వేర్వేరు ప్రాతిపదికలు తీసుకున్నాం. సైన్స్ గ్రూపులకు సీబీఎస్ఈని అనుసరించాం. సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే తగ్గించాం. సీబీఎస్ఈ కూడా తగ్గించింది కాబట్టి.. జేఈఈ, నీట్ వంటి జాతీయ పరీక్షలకు సమస్యే ఉండదు. తొలగించిన పాఠాల నుంచి ప్రశ్నలు రావు. హ్యుమానిటీస్​లో సిలబస్ తగ్గించేందుకు యూనివర్సిటీ, డిగ్రీ, ఇంటర్ స్థాయి అధ్యాపకులు, సబ్జెక్టు నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేశాం. వారు సూచించిన పాఠాలను తగ్గించాం. తొలగించిన పాఠాలను ఇవాళ లేదా రేపు ప్రకటిస్తాం.

ప్రశ్న: ఇంటర్​లో తొలగించిన పాఠాలకు.. కొనసాగింపుగా డిగ్రీ, ఇంజినీరింగ్​లో పాఠాలు ఉంటే.. విద్యార్థులకు ఇబ్బంది ఉండదా?

జవాబు: ప్రధాన పాఠాలను తొలగించలేదు. ఎక్కువగా అనుబంధ పాఠాలే కుదించాం. ఏదేమైనా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. సమయానుగుణంగా పరిష్కరించుకోవచ్చు.

ప్రశ్న: ప్రశ్నాపత్రం, పరీక్షల విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా?

జవాబు: పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగుతుంది. తగ్గించిన సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఉంటాయి.

ప్రశ్న: కాలేజీల అనుబంధ గుర్తింపుపై గందరగోళం ఎప్పుడు తొలగిపోతుంది?

జవాబు: గందరగోళం ఏమీ లేదు. ప్రభుత్వ కాలేజీలు 772, ప్రైవేట్ కాలేజీలు 77కి అనుబంధ గుర్తింపు ఉంది. వివరాలన్నీ వెబ్ సైట్​లో ఉన్నాయి.

ప్రశ్న: అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని కొంతకాలంగా ప్రైవేట్ కాలేజీలు కోరుతున్నాయి. దానిపై నిర్ణయం తీసుకున్నారా?

జవాబు: అవును. ఈ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వెంటనే అమలు చేస్తాం.

ప్రశ్న: ఇంటర్ విద్యార్థుల్లో సహజంగా కనిపించే ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

జవాబు: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కూడా 2,590 మంది కౌన్సిలర్లకు శిక్షణ ఇచ్చాం. విద్యార్థుల్లో ఒత్తిడిని ఎలా గుర్తించాలి.. ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలనే అంశంపై సైకాలజిస్టుల ద్వారా శిక్షణ ఇప్పించాం. హార్ట్ ఫుల్ నెస్ సొసైటీ గతేడాది 50వేల మంది విద్యార్థుల్లో.. ఒత్తిడిని అధిగమించి.. ఆత్మవిశ్వాసం పెంచే మెలుకువలు నేర్పించింది. అదే సంస్థ సహకారంతో ఈ ఏడాది ఆన్​లైన్ కార్యక్రమాలు రూపొందించాం. వారానికో పాఠం చొప్పున 16 వారాల పాటు దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తాం.

ప్రశ్న: కార్పొరేట్ కాలేజీలు రెసిడెన్షియల్ తరగతులకు ఫీజులు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది హాస్టళ్లకు అనుమతి ఉంటుందా?

జవాబు: హాస్టళ్లకు సంబంధించి 2018లోనే మార్గదర్శకాలు జారీ చేశాం. దానిని కొన్ని కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. కానీ ఎలాంటి స్టే లేదు. కాబట్టి హాస్టళ్ల నిర్వహణను నియంత్రిస్తాం. ఈ ఏడాది కొవిడ్ పరిస్థితులు ఉన్నందున.. మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. కఠినంగా నియంత్రిస్తాం.

ఇవీ చూడండి:

రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే.. హైకోర్టులో కౌంటర్ వేసిన శాసనసభ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details