సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను (sitharama project dpr) గోదావరి బోర్డుకు, కేంద్ర జలసంఘానికి తెలంగాణ అందజేసింది. పోలవరానికి (POLAVARAM PROJECT) నీటి లభ్యత తగ్గదని స్పష్టం చేసింది. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలుంటే 30తేదీలోగా తెలపాలని పేర్కొంది. గోదావరి నుంచి కృష్ణాలోకి ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీరు గతంలో పేర్కొన్నట్లుగా 20 టీఎంసీలు కాదని, 7.26 టీఎంసీలేనని తెలిపింది. ఈ ఎత్తిపోతల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ పేర్కొనడం అపోహ మాత్రమేనని, పోలవరానికున్న కేటాయింపులకు మించి నీటి లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంది. 2018లో కేంద్ర జలసంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో మార్పులతో పాటు ఎలక్ట్రో మెకానికల్ పనులు, నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అడిగిన సందేహాలకు సమాధానాలతో సహా అన్ని అంశాలను గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు అందజేసింది. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలేమైనా ఉంటే 30వ తేదీలోగా తెలపాలని.. లేదంటే ఆమోదించినట్లుగా భావించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు గోదావరి బోర్డు తెలిపింది.ఈ మేరకు గోదావరి యాజమాన్య మండలి సభ్యులు పి.ఎస్.కుటియాల్ లేఖ పంపారు.
ఆంధ్రప్రదేశ్‌ది అనుమానం మాత్రమే
సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నీటి సమస్య తలెత్తుతుందని ఆంధ్రప్రదేశ్ పేర్కొనడం అనుమానం మాత్రమేనని తెలంగాణ స్పష్టం చేసింది.
* 2018 అక్టోబరు 30న కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టరేట్ అభిప్రాయం ప్రకారం సీతారామ ఎత్తిపోతల వద్ద 332.87 టీఎంసీలు, పోలవరం వద్ద 571 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలిపింది. శబరిలో ఒడిశా వాటాను 75 శాతం నీటిలభ్యత ప్రకారం 112.8 టీఎంసీలకు బదులు కేంద్ర జలసంఘం పేర్కొన్నట్లు 159 టీఎంసీలను పరిగణనలోకి తీసుకొన్నా పోలవరం వద్ద 525 టీఎంసీలు ఉంటుంది. కేంద్రజలసంఘం 95వ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన దాని ప్రకారం ఇక్కడ అవసరం 449.78 టీఎంసీలు మాత్రమేనని తెలిపింది.