తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు ఊపందుకున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఇతర కేంద్రాల్లో పరీక్షలకు జనం తరలివచ్చారు. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 926, రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌లో 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంబర్‌పేట సర్కిల్‌లో కొత్తగా 9 మంది కరోనా బారినపడ్డారు. విద్యానగర్‌లోని ఓ కాలనీకి చెందిన న్యాయవాది గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 27 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
ఫీవరాసుపత్రిలో 340 మందికి పరీక్షలు
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. కూకట్‌పల్లి, మూసాపేట, పర్వత్‌నగర్, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట, హనుమాన్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 202 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేపడితే 40మందికి వైరస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 37 కేసులు నమోదయ్యాయి. సరిపడా కిట్‌లు లేక షాపూర్‌నగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో సోమవారం పరీక్షలు నిలిపివేశారు. మంగళవారం నుంచి చేస్తామని వైద్యులు తెలిపారు. దుండిగల్ ఆరోగ్యకేంద్రంలో 101 మందికిగాను 17మందికి కరోనా వచ్చింది. ఫీవరాసుపత్రిలో 340 మందికి పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు.