మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన 16 ఏళ్ల యువకుడు అజ్జు 11వ తరగతి చదువుతున్నాడు. గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అజ్జు తల్లిదండ్రులకు అతడు డ్యాన్సర్ అవడం ఇష్టం లేదు. చదువు మీద శ్రద్ధ పెట్టమని తరచూ మందలించేవారు. తనకు కుటుంబసభ్యులు సహకరించడం లేదని స్నేహితులతో చెప్పేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అజ్జు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝాన్సీ రోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడే పోలీసులకు అజ్జు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.
సూసైడ్ నోట్‌లో... "‘అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. నేను మీకు మంచి కొడుకును కాలేకపోయాను. మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. నేనొక గొప్ప డ్యాన్సర్‌ని కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. కానీ దానికి మీరు సపోర్ట్ చేయలేదు. నేను చేసే పనులేవి మీకు నచ్చవు. నా హెయిర్ స్టయిల్, నా స్నేహితులు.. నాకు సంబంధించినవి ఏవీ మీకు నచ్చవు. అందుకే నేను చనిపోతున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు." అని లేఖలో రాశాడు.