ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్యాంల నిర్వహణకు 400 మంది సాంకేతిక సిబ్బంది అత్యవసరం - ap latest news

వరద ప్రవాహాలు ఉద్ధృతంగా ముంచుకొస్తున్న వేళ డ్యాంల నిర్వహణ కత్తిమీద సామే. గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా అనుభవం ఎంతో ముఖ్యం. రాష్ట్రంలోని అనేక ప్రధాన డ్యాంలు, ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవమున్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేస్తున్నా.. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదు.

Technical personnel
Technical personnel

By

Published : Aug 14, 2021, 7:35 AM IST

వరద ప్రవాహాలు ఉద్ధృతంగా ముంచుకొస్తున్న వేళ డ్యాంల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా అనుభవం ఎంతో ముఖ్యం. రాష్ట్రంలోని అనేక ప్రధాన డ్యాంలు, ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవమున్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేస్తున్నా.. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రస్తుతం వర్కుఛార్జ్‌డ్‌ సిబ్బంది ఎక్కడా లేరు. కొన్నిచోట్ల కనీస మరమ్మతులతోపాటు గ్రీజు రాసే వాళ్లే కరవయ్యారు. జలాశయాల్లో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, క్రేన్‌ ఆపరేటర్లు, ఫోర్‌మన్‌ వంటి వారు అవసరం.

వీరిని శాశ్వత ప్రాతిపదికన భర్తీచేసి, శిక్షణ ఇచ్చి ప్రాజెక్టులపై నియమిస్తే ప్రస్తుతం కొద్దో గొప్పో ఉన్న సిబ్బంది నుంచి నేర్చుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖలో 400 మంది సాంకేతిక సిబ్బందిని డ్యాంలపై నియమించాల్సి ఉందని, అనుమతివ్వాలని ఆర్థిక శాఖకు ఎప్పుడో ప్రతిపాదన వెళ్లింది. సంబంధిత దస్త్రానికి ఆమోదం లభించడంలేదు.

వివిధ డెల్టాలలో లస్కర్ల పోస్టులు చాలా ముఖ్యం. చాలారోజుల నుంచి శాశ్వత నియామకాలు లేకపోవడంతో 5,000 మంది లస్కర్లు కావాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. పొరుగు సేవల నుంచైనా వీరిని నియమించాలని కోరినా.. కార్యరూపం దాల్చలేదు.

అమ్మో...! శ్రీశైలం పోస్టింగా?

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి జలాశయం శ్రీశైలం. అక్కడ పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏవైనా కారణాలతో పనిష్​మెంట్​గా పోస్టింగు ఇచ్చే సందర్భాలలో శ్రీశైలం పంపుతుంటారు. దీంతో అక్కడ పనిచేసే వారిలో చాలామంది ప్రాజెక్టు నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శ ఉంది. పైగా పిల్లల చదువులు, వసతులపరంగా సానుకూల పరిస్థితులు లేకపోవడంతో స్థానికంగానే ఉంటూ పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.

శ్రీశైలంలో ఉద్యోగం...కర్నూలులో క్యాంపు కార్యాలయం!

శ్రీశైలం ప్రాజెక్టులో సూపరింటెండెంటు ఇంజినీరు పోస్టు నియామకం ఎప్పటినుంచో పెండింగులో ఉంది. ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుకు సూపరింటెండెంటు ఇంజినీరుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చీఫ్‌ ఇంజినీరు కార్యాలయానికి అందుబాటులో ఉండాలనే కారణాన్ని చూపుతూ ఆయన కర్నూలులో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలుకు 180 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం జలాశయం డ్యాం ఉంటుంది. పలువురు కిందిస్థాయి అధికారులు కూడా ఈ క్యాంపు కార్యాలయం పేరుతో కర్నూలులోనే ఉండిపోతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details